జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్... ఏపీకి అనుకూలంగా వంశధార ట్రిబ్యునల్ తీర్పు

By Arun Kumar PFirst Published Jun 22, 2021, 3:46 PM IST
Highlights

వంశధార ట్రిబ్యునల్‌ తీర్పు పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.  

అమరావతి: వంశధార నదీ జలాలపై సంబంధిత ట్రిబ్యునల్ ఆంధ్ర ప్రదేశ్ కు అనుకూలంగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ట్రిబ్యునల్‌ తీర్పు పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం తర్వాత ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లయిందని... గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాగానే వెంటనే నేరడి వద్ద వంశదారపై బ్యారేజీ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈలోగా దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసుకోవాలన్నారు. 

 వంశధార నదీ జలాలు, నేరడి ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణపై ఒడిషా సర్కార్ దాఖలుచేసిన పిటిషన్లపై ట్రిబ్యునల్ తీర్పును వెలువరించింది.  ఏపీ ప్రభుత్వం కోరినట్లుగా 106ఎకరాల భూమిని సేకరించాలని ఒడిషా సర్కార్ ను ఆదేశించింది. నేరడి ప్రాజెక్టును కట్టుకునేందకు ఏపీ సర్కార్ కు పూర్తి అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

read more  సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించిన చిరంజీవి..

వంశధార ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే కాకుండా ఒడిశాకూ ప్రయోజకరమన్నారు సీఎం జగన్. తాము పొరుగు రాష్ట్రాలతో సంత్సంబంధాలు కోరుకుంటున్నామని... నేరడి బ్యారేజీ ద్వారా ఇరు రాష్ట్రాల ప్రజలకూ మంచి జరుగుతుందన్నారు. నేరడి బ్యారేజ్‌ నిర్మాణం కోసం జరిగే శంఖుస్థాపన కార్యక్రమానికి ఒడిశా సీఎంతోపాటు, ఆ రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తామన్నారు. వివాదాలతో కాకుండా పరస్పర సహకారంతో ముందుకుసాగాలన్నదే తమ విధానమన్నారు.

 ఈ ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ వంశధార ట్రిబ్యునల్‌ తీర్పుపై మాట్లాడారు. ఈ సందర్భంగా నేరడి ప్రాజెక్ట్ నిర్మాణంపై సంబంధిత శాఖ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. 


 

click me!