
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ (Lance Naik Sai Teja) కుటుంబాన్ని ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాశారు. భరతమాతకు సేవ చేయాలని 20 ఏళ్ల వయసులోనే ఆర్మీలో చేరి, 29 ఏళ్లకే అమరుడైన లాన్స్ నాయక్ సాయితేజకు తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోందన్నారు. తొమ్మిదేళ్ల సర్వీసులో ఏకంగా త్రివిధ దళాదిపతి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో చేరే స్థాయికి చేరడం వెనుక అతని కృషి, పట్టుదల, కష్టం నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు.
హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరారు. సాయి తేజ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాయితేజ కుటుంబాన్ని తక్షణమే అన్నివిధాలా ఆదుకోవాలని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు (Chittoor district) చెందిన లాన్స్‌నాయక్ బి సాయితేజ (Lance Naik Sai Teja) మృతిచెందారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు సాయితేజ పర్సనల్ సెక్యూరిటీ అధికారిగా ఉన్నారు. ఈ ఘటనలో బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌తో సహా మొత్తం 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇక, సాయి తేజ మృతిచెందారనే వార్త తెలియడంతో అతని స్వగ్రామం రేగడపల్లెలో విషాదఛాయలు నెలకొన్నాయి. సాయితేజ తల్లిదండ్రులు, భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బంధువులు, స్నేహితులు సాయితేజతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
వ్యవసాయ కుటుంబానికి చెందిన మోహన్, భువనేశ్వరి దంపతులకు సాయితేజ, మహేష్‌బాబు సంతానం. సాయితేజ స్థానికంగానే చదువుకున్నారు. 10వ తరగతి పూర్తి కాగానే దేశానికి సేవ చేయాలనే తపనతో సైన్యంలో చేరారు. డిగ్రీ పూర్తి చేసి గుంటూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌కు హజరై 2012లో సైనికుడిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పారా కమెండో పరీక్ష రాసి ఉత్తీర్ణతతో 11వ పారా లాన్స్ నాయక్ హోదా దక్కించుకున్నాడు. ఏడు నెలల క్రితమే జనరల్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా (PSO to the CDS) నియమితులయ్యారు. సాయితేజ సోదరుడు మహేష్‌బాబు కూడా సైన్యంలోనే ఉన్నారు.
ఇక, సాయితేజ అంత్యక్రియలకు స్వగ్రామంలోనే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో.. వాటి గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. కేవలం ముగ్గురి భౌతికకాయాలనే ఇప్పటివరకు గుర్తించారు. మిగిలినవారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం వీటిని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో ఉంచారు. గుర్తింపు తర్వాతే వారి బంధువులకు అప్పగించనున్నారు. దీంతో సాయి తేజ అంత్యక్రియలు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.