ఇప్పటికే పలు పథకాల పేర్లను చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది. ఈ మేరకు అధికారికంగా ఆయా శాఖలకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మార్కు చూపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తూ పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మార్చిన పథకాలు, కార్యక్రమాల పేర్లకు తిరిగి కొత్త పేర్లు పెడుతున్నారు. జగన్ హయాంలో అమలుచేసిన పథకాల పేర్లను తొలగించి కొత్తవి పెడుతున్నారు.
ఇప్పటికే పలు పథకాల పేర్లను చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది. ఈ మేరకు అధికారికంగా ఆయా శాఖలకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం పేరును చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్సార్ విద్యోన్నతి స్కీమ్ పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్చేశారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహంను ఇన్సెంటివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌గా, జగనన్న విద్యా దీవెనను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌గా, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్పు చేశారు. అలాగే, వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా పేరు మార్చారు. వైఎస్సార్ రైతు భరోసాకు అన్నదాతగా, జగనన్న విద్యా కనుకకు స్టూడెంట్ కిట్ స్కీంగా, జగనన్న గోరుముద్ద పథకానికి పీఎం పోషణ్ గోరుముద్దగా పేరు పెట్టారు. వైఎస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమా పథకంగా మార్పు చేశారు.
అలాగే, దిశా పోలీసు స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం... స్పందన కార్యక్రమాన్ని పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంగా మారుస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ క్రమంలో సచివాలయాలు, ఇతర కార్యాలయాలకు ఉన్న వైసీపీ రంగులు, జగన్ ఫొటోలను తొలగించాలని ఆదేశాలిచ్చింది.
జగన్ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ వైద్య విశ్వవిద్యాలయంగా మార్చడంపై పెద్ద వివాదమే చెలరేగింది. అయితే, అప్పటి ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ అంశంపై దృష్టి పెట్టింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే హెల్త్ వర్సిటీ పేరు తిరిగి మార్చారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అదే పేరుతో కొనసాగేలా ఉత్వర్వులు విడుదల చేశారు.
తాజాగా మరో కార్యాలయం పేరును చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ‘రైతు సేవా కేంద్రాలు’గా మారుస్తూ వ్యవసాయ శాఖ జీవో విడుదల చేసింది. అలాగే, రైతు భరోసా కేంద్రం లోగోతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రంతో ఉన్న బోర్డులు తక్షణమే తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.