Chandrababu Naidu: ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా..?.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

By team teluguFirst Published Dec 6, 2021, 2:36 PM IST
Highlights

జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలను దోపిడీ చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విమర్శించారు. ఇళ్లకు ఓటీఎస్(వన్ టైమ్ సెటిల్మెంట్) పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా అని ప్రశ్నించారు. 

జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలను దోపిడీ చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విమర్శించారు. ఇళ్లకు ఓటీఎస్(వన్ టైమ్ సెటిల్మెంట్) పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా అని ప్రశ్నించారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.పేద ప్రజలు ఎందుకు ఓటీఎస్ కట్టాలని ప్రశ్నించారు. ఓటీఎస్ కట్టాలని అధికారులు ఒత్తిళ్లు చేయడమేమిటని మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగులు, అధికారుల ఒత్తిళ్లు చట్టవిరుద్దం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

OTS కట్టని ప్రజలను వేధిస్తున్నారని చెప్పారు. పట్టా ఇవ్వడానికి వైఎస్ జగన్ ఎవరని.. ఆయన స్థలం ఇచ్చారా..?, ఇళ్లు కట్టించారా..? అంటూ ధ్వజమెత్తారు. ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తానని చెప్పిన వైఎస్ జగన్ (ys jagan).. మాట తప్పారని, మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట తప్పినందుకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఉన్మాదం పరాకాష్టకు చేరిందని విమర్శించారు. ఓటీఎస్ టార్గెట్లు పూర్తి చేయడం కోసం తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన పనులే వారికి శాపంగా మారతాయని అన్నారు. 

ఓటీఎస్ కోసం ఒత్తిడి లేదని చెప్తున్న మాటలు పచ్చి అబద్దం అని అన్నారు. ఓటీఎస్ కట్టకుండా సహాయ నిరాకరణకు ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగు దేశం పార్టీ వారికి అండగా ఉంటుందని అన్నారు.  

రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను స్పూర్తిగా తీసుకుని ఎన్టీఆర్.. తెలుగు దేశం పార్టీని స్థాపించారని అన్నారు. అంబేడ్కర్ ఆశయాల కోసం ఎన్టీఆర్‌ కృషి చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా రాజ్యాంత నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆంశాలు భారతదేశానికే కాకుండా చాలా దేశాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. 2016లో అంబేద్కర్‌ 125 జయంతిని పురస్కరించుకొని నవ్యాంధ్రప్రదేశ్‌లో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రాహానికి జీవో తీసుకువచ్చామని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 20 ఎకరాల భూమి కూడా ఎంపిక చేసినట్టుగా చెప్పారు.  విగ్రహ నిర్మాణం కోసం టీడీపీ తీసుకొచ్చిన జీవోను కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేశారని మండిపడ్డారు.

click me!