ఎల్వీ దూకుడు, ఈసీ ఆంక్షలు: చంద్రబాబు నిస్సహాయత

By telugu teamFirst Published Apr 26, 2019, 4:39 PM IST
Highlights

చంద్రబాబు అధికారాలకు దాదాపుగా కత్తెర వేశారు. దీంతో ఆయన అసనహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించకూడదని ఆయన ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన చిక్కులను ఎదుర్కుంటున్నారు. దాంతో ఆయన ఆసహనంతో చెలరేగిపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఎన్నికల సంఘం, మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చంద్రబాబును ఊపిరి సలపనీయడం లేదు.

చంద్రబాబు అధికారాలకు దాదాపుగా కత్తెర వేశారు. దీంతో ఆయన అసనహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించకూడదని ఆయన ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశాలకు హాజరైన అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి ఎల్వీ సుబ్రహ్మణ్యం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సమావేశాలకు హాజరు కాకూడదని ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. 

చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనకు ఏనాడూ ఎదురు కాని అనుభవం ఇప్పుడు ఎదురవుతోంది. తన అధికారాలకు కత్తెర వేసే హక్కు ఎవరికీ లేదని చంద్రబాబు చెబుతున్న మాటలను ఎవరూ ఖాతరు చేయడం లేదు. చంద్రబాబు రాస్తున్న లేఖలకు ఈసి నుంచి సమాధానాలు కూడా లేవు. 

తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని కానని, పూర్తి స్థాయి ముఖ్యమంత్రినని చంద్రబాబు చెబుకున్నా ఫలితం ఉండడం లేదు. ఎల్వీ సుబ్రహ్మణ్యం సిఎస్ గా రావడం ఆయనకు మింగుడు పడలేదని అర్థమవుతూనే ఉన్నది. ఆయన సిఎస్ గా వచ్చినప్పటి నుంచి చంద్రబాబు రుసరుసలాడుతూనే ఉన్నారు. ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. దాంతో ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా అదే రీతిలో తన అధికారాన్ని ప్రయోగిస్తూ వస్తున్నారు. 

చంద్రబాబు సమీక్షలకు హాజరైన అధికారులకు ఎల్వీ సుబ్రహ్మణ్యం నోటీసులు జారీ చేయడం మరింతగా చిక్కులు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి చంద్రబాబు మళ్లీ సమీక్షల జోలికి వెళ్లలేదు. చంద్రబాబు జూన్ 8వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రులు, తెలుగుదేశం నాయకులు అంటున్నారు. 

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఎప్పుడైనా, ఎక్కడైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చునని, వైసిపికి మెజారిటీ వస్తే మాత్రం మే 23వ తేదీన రాజీనామా చేయాల్సి ఉంటుందని, వైసిపి వాళ్లు ప్రమాణస్వీకారం కోసం మే 24వ తేదీ నుంచి ఎప్పుడైనా ఏర్పాట్లు చేసుకోవచ్చునని ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదని అంటూనే ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలులో ఉన్నందు వల్ల అధికారాలకు పరిమితులు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. 

ఎన్నికల ఫలితాలు వెలువడడానికి చాలా వ్యవధి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓ సంధి కాలాన్ని ఎదుర్కుంటున్నట్లు అనిపిస్తోంది. గ్యారంటీ అధికారానికి వస్తామని అటు చంద్రబాబుకు గానీ ఇటు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గానీ చెప్పుకునే వాతావరణం లేదు. రాష్ట్రం ప్రస్తుతం సందిగ్దావస్థను ఎదుర్కుంటోంది.

click me!