మందడంలో ఓ పాఠశాల గదిలో లేడీ కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుండగా జర్నలిస్టులు ఫొటోలు తీశారనే ఆరోపణపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చారు. వారిపై నిర్భయ కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు.
అమరావతి: మందడంలోని పాఠశాలలో లేడీ కానిస్టిబుల్ దుస్తులు మార్చకుంటుండగా జర్నలిస్టులు ఫొటోలు తీశారనే ఆరోపణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఏం జరిగిందో ఆయన ఓ ప్రకటనలో వివరించారు. మందడంలోని పాఠశాలలో తరగతి గదిని పోలీసులు ఆక్రమించారని, విద్యార్థులను బయటకు పంపడాన్ని తల్లిదండ్రులు మీడియా దృష్టికి తీసుకుని వెళ్లారని ఆయన చెప్పారు.
విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు పాఠశాలకు వెళ్లారని, తరగతి గదిలో ఆరేసిన దుస్తులను ఫొటోలు తీసి, చానెళ్లలో ప్రసారం చేశారని, దానిపై అక్కసుతో ముగ్గురు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించారని ఆయన అన్నారు. జర్నలిస్టులపై నిర్భయ కేసు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ట అని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియంత పోకడలతో, తిక్క చేష్టలతో రాష్ట్రం అప్రతిష్ట పాలవుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత 8 నెలలుగా రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని, మీడియాపై రాష్ట్ర ప్రభుత్వ అణచివేత చర్యలను గర్హిస్తున్నామని ఆయన చెప్పారు.
అధికారం చేపట్టగానే ముగ్గురు మంత్రులు సమావేశం పెట్టి ఎంఎస్ఓలను బెదిరించారని, రెండు చానళ్ల ప్రసారాలాపై ఆంక్షలు విధించారని ఆయన విమర్శించారు. అసెంబ్లీ ప్రసారాలు చేయకుండా మూడు టీవీ చానెళ్లపై నిషేధం పెట్టారని, జీవో 2430 తెచ్చి మీడియాపై ఉక్కు పాదం మోపారని ఆయన అన్నారు.
మీడియాపై దౌర్జన్యాలు చేసిన వైసీపీ నేతలను ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తునిలో విలేకరి హత్య, చీరాలలో విలేకరిపై హత్యాప్రయత్నం చేశారని ఆనయ ఆరోపిచారు. నెల్లూరుులో ఎడిటర్ పై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేసారని గుర్తు చేశారు. ఫోర్త్ ఎస్టే మీడియా మనుగడకే జగన్ ప్రభుత్వం ముప్పు తెచ్చిందని, మీడియా గొంతు నులిమే నియంత ధోరణులను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఇలాంటి నియంతలంతా కాలగర్భంలో కలిసిపోయారని ఆయన జగన్ ను ఉద్దేశించి అన్నారు.