రాజధానిని అమరావతి నుంచి మార్చవద్దని తాను చేతులెత్తి వేడుకుంటే జగన్ ఓ వెకిలి నవ్వు నవ్వారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. యేసు ప్రభువు మీద నమ్మకం ఉంటే జగన్ రాజధానిని మార్చకూడదని అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు యేసు ప్రభువుపై విశ్వాసం ఉంటే ఇక్కడే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తానని చెప్పాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారంనాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాజధాని కోసం 39 మంది రైతులు చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు లేవని వైఎస్ జగన్ అసత్యాలు చెబుతున్నారని ఆయన అన్నారు. అమరావతిని శ్మశానం అన్నారని గుర్తు చేస్తూ శ్మశానంలో కూర్చుని పాలించారా అని అడిగారు.
రాజధానికి వరదలు వస్తాయని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆయన అన్నారు. ప్రభుత్వమంటే నమ్మకమని, అసత్యాలు చెప్పకూడదని ఆయన అన్నారు. చట్టాలను ఉల్లంఘించేది అసలు ప్రభుత్వమే కాదని ఆయన అన్నారు. రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులను సీఎం వద్దకు తీసుకుని వెల్లి సంఘీభావం ప్రకటింపజేసుకున్నారని ఆయన అన్ారు.
అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని అమరావతిని ప్రారంభించడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. 2015 ఏప్రిల్ 24వ తేదీన జీవో జారీ చేసి అమరావతిని రాజధానిగా చేశామని, అదే విషయాన్ని నిన్న కేంద్రం చెప్పిందన ఆయన అన్నారు.
రాజధానిని నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుందని కేంద్రం చెప్పింది కానీ రాజధానిని మార్చడానికి హక్కు ఉంటుందనే చెప్పలేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు పెట్టుకోవాలని కేంద్రం చెప్పలేదని చంద్రబాబు అన్నారు. దేశమంతా మారుతున్నారు ాకనీ మన తుగ్లక్ జగన్ మారడం లేదని ఆయన అన్నారు.
జగన్ పిచ్చి నవ్వు నవ్వుతూ ఎదురు దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. అమరావతి నుంచి రాజధానిని మార్చవద్దని అసెంబ్లీలో చేతులెత్తి వేడుకున్నానని, జగన్ మాత్రం వెకిలి నవ్వు నవ్వుతున్నారని ఆయన అన్నారు.
ఐదు కోట్ల ప్రజలు ఒకవైపు ఉంటే జగన్ మరో వైపు ఉన్నారని ఆయన అన్నారు. తప్పు చేస్తున్నామని తెలిసి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేని దద్దమ్మలుగా మిగిలిపోయారని ఆయన అన్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ తప్పు అని చెప్పిన నేతలు విశాఖలో పేదల అసైన్డ్ భూములను కొట్టేస్తున్నారని ఆయన ఆరోపించారు. భూమి అమ్మి అభివృద్ధి చేసేంత మూర్ఖులు ఎవరూ ఉండరని ఆయన అన్నారు.