బాహుబలి గ్రాఫిక్స్ చూపించను: అమరావతిపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు

By telugu teamFirst Published Feb 5, 2020, 11:45 AM IST
Highlights

అమరావతిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1.09 లక్షల కోట్లతో అమరావతిని నిర్మించడం సాధ్యం కాదని, నిధుల కొరత అందుకు అనుమతించదని జగన్ అన్నారు. తాను గ్రాఫిక్స్ చూపించబోనని జగన్ అన్నారు.

విజయవాడ: అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ది హిందూ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఆయన బుధవారం మాట్లాడారు. ఓ ముఖ్యమంత్రిగా తాను కీలకమైన నిర్ణయాలు తీసుకోకపోతే దాని ప్రభావం భవిష్యత్తుపై పడుతుందని ఆయన అన్నారు. 

రాజధానిగా చెబుతున్న ప్రాంతంలో ప్రస్తుతం రోడ్లు కూడా లేవని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని ఆయన అన్నారు. అమరావతి నిర్మాణానికి 1.09 లక్షల కోట్లు అవసరమవుతాయని, మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఎకరానికి 2  కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఇటువంటి స్థితిలో అమరావతిని నిర్మించడం చాలా కష్టమని ఆయన అన్నారు. 

అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా కొనసాగుతుందని, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉంటుందని ఆయన చెప్పారు. విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేస్తామని, భవిష్యత్తు తరాలకు జవాబుదారీగా ఉండాలని ఆయన అన్నారు.

ఐదేళ్లలో విశాఖను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రచించామని ఆయన చెప్పారు .లక్ష కోట్లు ఖర్చు పెట్టలేకనే పాలన వికేంద్రీకరణను చేపట్టామని ఆయన చెప్పారు. తాను బాహుబలి గ్రాఫిక్స్ చూపించబోనని, లేనివి చూపించి ప్రజలను మోసం చేయలేనని ఆయన చెప్పారు సింగపూర్, జపాన్ తరహా గ్రాఫిక్స్ చూపించలేనని ఆయన అన్నారు. తాను ఎవరినీ తప్పు పట్టాలని అనుకోవడం లేదని ఆయన అన్నారు.ఖర్చు చేయడానికి జపాన్, సింగపూర్ లను సృష్టించడానికి మన వద్ద లేవని, తాను ఎంత చేయగలుగుతానో అంతే చెప్తానని ఆయన అన్నారు.

విశాఖపట్నంలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అమరావతిలోనూ అభివృద్ధి కొనసాగుతుందని జగన్ చెప్పారు. అమరావతిపై పెట్టే ఖర్చులో పదిశాతం ఖర్చు చేస్తే విశాఖ హైదరాబాదు, బెంగుళూర్, ముంబైలతో పోటీ పడుతుందని ఆయనఅన్నారు.

రాయలసీమలో డ్యామ్ లు నిడడం లేదని, తన తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదని, రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 2 వేల కోట్లు కావాలని ఆయన అన్నారు. 1600 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయని ఆయన చెప్పారు. 3 వేల టీఎంసీల గోదావరి నీరు వృధాగా పోతోందని ఆయన చెప్పారు. వాటికి నిధులు ఎక్కడి నుంచి తేవాలని ఆయన అడిగారు.

ఇంగ్లీష్ ద్వారానే పోటీ ప్రపంచంలో నెగ్గురాగలమని ఆయన అన్నారు. తాను రాష్ట్రానికి తండ్రి వంటివాడినని, ఒక్క తండ్రి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చేర్పించాలని అనుకుంటాడని ఆయన అన్నారు. ఇంగ్లీష్ మీడియం లగ్జరీ కాదని, అవసరమని ఆయన అన్నారు. 

click me!