రోడ్డెక్కారు: జగన్, పవన్ కల్యాణ్ లపై చంద్రబాబు కామెంట్

First Published Jun 1, 2018, 1:51 PM IST
Highlights

అనుభవం లేనివాళ్లు పరిపాలన చేస్తామంటూ రోడ్డెక్కారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

అమరావతి: అనుభవం లేనివాళ్లు పరిపాలన చేస్తామంటూ రోడ్డెక్కారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లను ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్య చేశారు. పవన్ పోరాట యాత్ర పేరుతోనూ, జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతోనూ పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాము వేసిన రోడ్ల మీదనే నడుస్తూ తమనే విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ దేశంలో అందరినీ మోసం చేశారని, ప్రధాని మాటలు విని తాను కూడో మోసపోయానని అన్నారు. ఎటిఎంల్లో డబ్బులు లేని పాలన దేశంలో సాగుతోందని ఆయన అన్నారు. 

ప్రధాని మైక్ తీసుకుంటే ఎవరూ ఆపలేరని, ఆయన మాటలు కోటలు దాటుతున్నాయని, ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు.  మూడో సంవత్సరం చంద్రన్న భీమా పథకాన్ని ఉండవల్లిలో ముఖ్యమంత్రి ఆయన ప్రారంభించారు.

చంద్రన్న బీమా తనకు ఎంతో సంతృప్తిని కలిగించిందని, బీమా మిత్రలు అద్భుతంగా పనిచేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పథకాల్లో దళారుల జోక్యం లేకుండా చేశామని ఆయన అన్నారు.
 
రోడ్డుప్రమాదాల్లో డ్రైవర్లు చనిపోవడం బాధాకరమని, డ్రైవర్‌ చనిపోతే ఆ కుటుంబం కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుందని, డ్రైవర్లను ఆదుకోవాలని బీమా పథకాన్ని ప్రారంభించామని  చంద్రబాబు చెప్పారు. పెద్దకర్మ రోజే బాధితులకు బీమా సొమ్ము అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

click me!