
చంద్రబాబును చూస్తే అయ్యో పాపం అనిపిస్తోంది. గడచిన రెండున్నరేళ్లుగా చంద్రబాబుకు ఏ విషయంలోనూ పెద్దగా కలిసి రావటం లేదనే అనిపిస్తోంది. తాజాగా పెద్ద నోట్లరద్దు కావచ్చు, ప్రత్యేకహోదా నిరాకరణ కావచ్చు, రాజధానికి నిధుల సమీకరణ కావచ్చు, రుణ పరిమితిని పెంచుకోవటం కావచ్చు. అనేక విధాలుగా కాలం కొంత వరకూ కలిసి వచ్చి గడచిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యారు తప్పితే సుఖం మాత్రం దక్కటం లేదు. రాష్ట్ర విభజన కారణంగా ప్రతీ చిన్న విషయానికీ సిఎం కేంద్ర ప్రభుత్వంపై ఆదారపడక తప్పటం లేదు. దాంతో మిత్రపక్షమే అయినప్పటికీ కేంద్రం, ఇంకా సూటిగా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్రమోడి చంద్రబాబుతో ఒక రేంజిలో ఆటాడుకుంటున్నారు.
గతంలో వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నపుడు తనకు తెలీకుండా, తనకు చెప్పకుండా కేంద్రంలో ఏమీ జరగలేదని, అందుకే తాను చక్రంతిప్పానని చంద్రబాబు తరచూ చెప్పుకుంటుంటారు. అయితే, ప్రస్తుతం ప్రధానిగా ఉన్నది నరేంద్రమోడి అన్న విషయాన్ని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు మరచిపోతున్నారా అన్న అనుమానం వస్తోంది. ఎందుకంటే, అనేక విషయాల్లో సిఎం గతంలోనే ఉండిపోయారేమో అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకుతాజా ఉదాహరణగా పెద్ద నోట్ల రద్దు కనబడుతోంది. తాను చెప్పబట్టే కేంద్రం వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేసారంటూ సిఎం చెప్పుకున్నారు. అయితే, ఆయన సంతోషాన్ని ప్రధాని రెండు రోజులు కూడా నిలవనీయలేదు. పెద్ద నోట్లను రద్దు చేయటం లేదని కేవలం డిజైన్ మాత్రమే మార్చామంటూ అరుణ్జైట్లీ చేసిన ప్రకటనతో టిడిపి ఖంగుతిన్నది. జైట్లీ ప్రకటనతో ఏ విధంగా స్పందించాలో అర్ధంకాక చంద్రబాబుకు అర్ధం కావటం లేదు. ఎందుకంటే, నల్లధనాన్ని నియంత్రిచటమే లక్ష్యంగా కేంద్రం వెయ్యి, 500 నోట్లను రద్దు చేసిందని చెప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, నల్లధనాన్ని అరికట్టే విషయంలో కేంద్రానికి చిత్తశుద్ది లేదన్న విషయం ఇపుడు స్పష్టమైపోయింది. ఎందుకంటే, పాత నోట్ల స్ధానంలో అంతే విలువ గలిగిన నోట్లను తీసుకురావటమే కాకుండా అదనంగా రెండు వేల రూపాయల విలువ కలిగిన నోట్లను కూడా తెచ్చింది. దాంతో నల్లధనంపై నియంత్రణపై చంద్రబాబు రాసిన లేఖను కేంద్రం మాత్రం ఖాతరుచేయలేదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది.
ఇక, రాష్ట్రానికి ప్రత్యేకహోదా నిరాకరణ, రాష్ట్రానికి రుణ పరిమితి పెంపుపై సాచివేత ధోరణి, రెవిన్యూలోటు భర్తీ విషయంలో చేయి ఇవ్వటం, పోలవరానికి నిధులివ్వటం లాంటి అనేక విషయాల్లో చంద్రబాబు మాట ఏ విధంగాను కేంద్రం వద్ద సాగటం లేదు. పైగా కేంద్రం నుండి రాష్ట్రానికి ఏ పథకానికి నిధులు మంజూరవ్వాలన్నా అంతకుముందు విడుదల చేసిన నిధులకు పక్కాగా లెక్కలడగటం కూడా ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. చేసేదేమీ లేక ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఉన్నారనిపిస్తోంది. అప్పటికీ కేంద్రంలో వెంకయ్యనాయడు ఉండబట్టే చంద్రబాబు పరిస్ధితి కొంతలో కొంత నయమని టిడిిపి వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.