
రాజధాని అమరావతి నిర్మాణంలో పవన్ కల్యాణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుకు బాగానే చురకలు వేసారు. రాజధాని రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలకూ సంబంధించినదిగా ఉండాలని కానీ కొంతమందికి మాత్రమే చెందినదిగా ఉండకూడదన్నారు. ఏదో కొందరి కోసమో, ఒక్క ప్రాంతం కోసమే రాజధాని అన్నట్లు ఉండకూడదని చంద్రబాబును హెచ్చరించారు. అమరావతి కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలకు మాత్రమే పరిమితమైందన్న ఆరోపణలు బాగా వినబడుతున్న నేపధ్యంలో పవన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
చంద్రాబాబు చర్యల వల్ల రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రాజధాని తమదు కాదేమోనన్న భావన బలపడుతున్నట్లు పవన్ ధ్వజమెత్తారు. దానివల్ల ఉత్తరాంధ్రలోనూ, రాయలసీమలోనూ వేర్పాటువాదం బలపడే అవకాశాలున్నట్లు పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి ఆలోచనలు, వేర్పాటు వాద భావనలు బలపడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందని స్పష్టం చేసారు. వేర్పాటు వాదాన్ని మొగ్గలోనే తుంచేయకపోతే మరో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు మొదలవుతాయని కూడా పవన్ చెప్పారు.తన రాజకీయ యాత్రకు అనంతపురాన్ని ఎంపికచేసుకోవడం , అనంతపురాన్నుంచి పోటీచేస్తాననడం, అనంతపురంలోనే పార్టీ మొదటి రాజకీయ కార్యాలయం ప్రారంభవుతుందని చెప్పడం వెనక పవన్ చాలా హోం వర్క్ చేసినట్లు అర్థమవుతుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామికంగా కేవలం ఒకటిరెండు కులాలకు చెందిన వారు మాత్రమే ఉన్నత స్ధితిలో ఉన్నారని పవన్ అన్నారు. అలాకాకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. వెనుకబడిన కులాలు, దళిత వర్గాల వారు కూడా పారిశ్రామికంగా ఎదిగేందుకు చంద్రబాబు తోడ్సాటు అందివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల వారికి, అన్నీ కుల,మతాలవారికీ చోటుండాలని సూచించారు. రాజధానిలో భవిష్యత్తులో సంపన్నులకేనా లేక సామాన్యులకు కూడా చోటుంటుందా అన్న విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేయాలని పవన్ డిమాండ్ చేసారు. రాష్ట్రాన్ని కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అధికార తెలుగుదేశంపార్టీ అభివృద్ధి చేయాలని పవన్ సూచించారు.