దేవాలయాలను మనమే కాపాడుకోవాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు. రాష్ట్రంలోని ఆలయాలపై వరుసగా సాగుతున్న దాడులపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
అమరావతి: దేవాలయాలను మనమే కాపాడుకోవాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు. రాష్ట్రంలోని ఆలయాలపై వరుసగా సాగుతున్న దాడులపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
మంగళవారం నాడు అమరావతిలో జరిగిన టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రామతీర్థం ఘటన అమానుషమన్నారు. రామతీర్థం పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి తనకు అడుగడుగునా అడ్డు తగిలారన్నారు. రామతీర్థంలో తాను పర్యటించడంతో ప్రభుత్వం భయపడి తమపై నిందలు వేస్తోందన్నారు. ఈ ఘటన జరిగి 15 రోజులైనా ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మతమార్పిడులు చేయించడానికి వీల్లేదన్నారు. కుల, మతాలకు అతీతంగా పాలన చేస్తానని చేసిన ప్రమాణాన్ని జగన్ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. రిజర్వేషన్లు ఉన్న ఫాస్టర్లకు రూ. 5 వేలు ఇవ్వడం చట్ట విరుద్దమన్నారు. హిందూవులతో పాటు ముస్లింలపై దాడులు జరుగుతున్నాయన్నారు.
హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఇక ఉపేక్షించేది లేదని చంద్రబాబు చెప్పారు. సీఎం, హోం మంత్రి, డీజీపీ క్రిస్టియన్లు అయితే దేవాలయాలపై జరిగే దాడులను ఆపరా అని ఆయన ప్రశ్నించారు.
తప్పుడు కేసులు బనాయించే ఏ పోలీసును కూడ వదిలిపెట్టబోనని ఆయన హెచ్చరించారు.