పిల్లలకు పాఠాలే కాదు... ప్రభుత్వానికి గుణపాఠమూ చెబుతాం...: మహిళా ఉద్యోగుల హెచ్చరిక

Arun Kumar P   | Asianet News
Published : Feb 03, 2022, 12:03 PM IST
పిల్లలకు పాఠాలే కాదు... ప్రభుత్వానికి గుణపాఠమూ చెబుతాం...: మహిళా ఉద్యోగుల హెచ్చరిక

సారాంశం

ఇటీవల జగన్ సర్కార్ ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ  క్రమంలోనే ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులు ఇటీవల జగన్ సర్కార్ ప్రకటించిన పీఆర్సీ (prc) ని వ్యతిరేకిస్తూ ఉద్యమం బాట పట్టారు. వెంటనే పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ(గురువారం) ఛలో విజయవాడ (chalo vijayawada) కు పీఆర్సీ సాధన సమితి పిలుపునివ్వడం... కరోనా కారణంగా ఇందుకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విజయవాడకు ఉద్యోగులు చేరుకోకుండా భారీగా నిర్బంధాలు పెట్టి పోలీసులు అడ్డుకుంటే... పోలీసుల నుండి తప్పించుకుని భారీగా ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు. 

ఇలా ఏపీ ఎన్జీవో భవన్‌ (AP NGO Bhavan) వద్దకు వేలసంఖ్యలో ఉద్యోగులు చేరుకుని బీఆర్‌టీఎస్ (BRTS) రోడ్డు వైపు భారీ ర్యాలీగా బయలుదేరారు. కానీ పోలీసులు వారిని బీఆర్‌టీఎస్ వేదికపైకి అనుమతించకపోవడంతో రహదారిపైనే బైఠాయించారు. భారీగా చేరుకున్న ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త  పరిస్థితి నెలకొంది. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) పై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి. జగన్‌ గారూ... మేం మీ అక్కాచెల్లెళ్లమే కదా...మాకు అన్యాయం చేయడం న్యాయంగా వుందా... అంటూ మహిళా ఉద్యోగుల నినాదాలు చేసాయి. మేము కేవలం పిల్లలకు పాఠాలు మాత్రమే కాదు... చెప్పమంటే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామంటూ ఉపాధ్యాయులు హెచ్చరించారు. 

ముఖ్యమంత్రి గారు మా గోడు వినండి అంటూ కొందరు మహిళా ఉద్యోగులు పాటరూపంలో వేడుకున్నారు. సలహాదారుల మాటలు విని తమకు అన్యాయం చేయవద్దని... వారి మాటలు పక్కనబెట్టి ఒక్కసారి తమ గోడు వినాలని సీఎంను కోరారు.

ఫ్రెండ్లీ ప్రభుత్వమంటే స్మగ్లర్ల మాదిరిగా ఉద్యోగులను బస్సులు, రైళ్ల నుంచి దింపడమేనా? అని ఉద్యోగులు ప్రశ్నించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం దిగివచ్చేవరకు తమ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామని ఉద్యోగులు తెలిపారు.

 ఇప్పటికే విజయవాడలోని బీఆర్‌టీఎస్‌ వద్దకు 13 జిల్లాల నుంచి వేలాదిగా ఉద్యోగులు  చేరుకోగా ఇంకా పోలీసుల నిర్భందాలు దాటుకుని చాలామంది వస్తున్నారు. ఇలా భారీగా మొహరించినప్పటికీ పోలీసులు నిలువరించలేనంతగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు. దీంతో బీఆర్‌టీఎస్ రోడ్డులో సీసీ కెమెరాల ద్వారా పోలీసులు మానిటరింగ్‌ చేస్తున్నారు. అలంకార్‌ థియేటర్‌ నుంచి కిలోమీటర్ల మేర ఉద్యోగుల ర్యాలీ కొనసాగుతోంది. 

అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దుచేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులు ధరించిన ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వమే లేదంటూ నినాదాలు చేస్తున్నారు. 

తమను ప్రభుత్వం తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తోందని... దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నేను ఉన్నాను... నేను విన్నానని ప్రతిపక్ష నేతగా జగన్‌ అన్నారని గుర్తుచేసిన ఉద్యోగులు ఇవాళ సీఎం అయ్యాక తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమవడం దారుణమన్నారు. 

నిరంకుశంగా చలో విజయవాడను అణచివేసే చర్యలను ఖండిస్తున్నామని... ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు వెనుకాడమని ఉద్యోగులు హెచ్చరించారు. సీఎం జగన్ పట్టుదలకు వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. తాము ఏపీలోనే ఉన్నామని... పాకిస్థాన్‌లో కాదని... ఇలా అణచివేత తగదన్నారు. ఉద్యోగుల జీవితంలో ఇది చీకటిరోజని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేసారు.


 

PREV
click me!

Recommended Stories

Bhuma Akhila Priya Reacts to Allegations of Irregularities in Ahobilam Temple | Asianet News Telugu
Pawan Kalyan on Blind Cricketer Deepika TC Road Request | Janasena Party | Asianet News Telugu