
అనంతపురం : బైక్ పై వస్తారు...మెడలో బంగారంతో ఒంటరిగా కనిపించే మహిళలను టార్గెట్ చేస్తారు... ఏం జరుగుతుందో తెలిసేలోపే బంగారాన్ని తెంపుకుని ఉడాయిస్తారు. ఇలా పట్టపగలే నడిరోడ్లపై అందరిముందే దొంగతనాలకు పాల్పడుతున్నారు చైన్ స్నాచర్లు. తాజాగా అనంతపురంలో ఇంటిబయట ఊడుస్తున్న మహిళ మెడలోంచి రెప్పపాటులో బంగారాన్ని తెంచుకుని పరారయ్యారు ఇద్దరు దొంగలు. ఈ చైన్ స్నాచింగ్ సిసి కెమెరాల్లో రికార్డయి ఆ వీడియో వైరల్ గా మారింది.
అనంతపురం పట్టణంలోని 5వ రోడ్డులోని ఇంటిముందు మారెక్క అనే మహిళ చీపురతో ఊడుస్తూ చైన్ స్నాచర్ల కంట పడింది. ఆమె మెడలో బంగారాన్ని కొట్టేయాలని నిర్ణయించుకున్న ఇద్దరు దొంగలు బైక్ పై వచ్చి ఆ ఇంటిముందు ఆగారు. ఒకడు బైక్ స్టార్ట్ చేసుకుని రెడీగా వుండగా మరొకడు మహిళ వద్దకు వెళ్లి ఏదో అడ్రస్ అడుగుతున్నట్లు నటించాడు. మారెక్కతో మాట్లాడుతూనే ఒక్కసారిగా ఆమె మెడలోంచి బంగారాన్ని లాగేసాడు. ఆమె తేరుకునేలోపే రెడిగా వున్న బైక్ ఎక్కి పరారయ్యాడు.
Read More షాకింగ్ : పరీక్షా కేంద్రంలో తోటి విద్యార్థిని కత్తి పొడిచిన తొమ్మిదో తరగతి స్టూడెంట్..
మహిళ మెడలోంచి బంగారాన్ని దొంగిలించడాన్ని రోడ్డుపై వెళుతున్నవారు చూసినా క్షణాల్లో స్నాచర్స్ అక్కడినుండి మాయం కావడంతో ఏం చేయలేకపోయారు. బాధిత మహిళ అసలేం జరిగిందో కూడా ఊహకందక దిగ్భ్రాంతికి గురయ్యింది. కొద్దిసేపటికి షాక్ నుండి బయటకు వచ్చిన ఆమె కుటుంబసభ్యులకు విషయం తెలిపి పోలీసులను ఆశ్రయించింది.
వీడియో
మారెక్క ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడున్న సిసి కెమెరా రికార్డింగ్ పరిశీలించగా దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో ఆధారంగా చైన్ స్నాచర్లను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. చైన్ స్నాచర్స్ ఎత్తుకెళ్లిన బంగారం రెండు తులాలు వుంటుందని మారెక్క తెలిపింది.
ఈ చైన్ స్నాచింగ్ వీడియో బయటకు రావడంతో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన అనంతపురం మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లడానికి భయపడిపోతున్నారు. పట్టణంలో రెచ్చిపోతున్న దొంగలను పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి చైన్ స్నాచింగ్స్ జరక్కుండా చూడాలని కోరుతున్నారు.