అవార్డు ఇవ్వకున్నా.. చూడ్డానికి వచ్చే వాడిని : గురజాడ పురస్కారంపై చాగంటి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 30, 2022, 8:41 PM IST
Highlights

తనకు గురజాడ అవార్డ్ ఇవ్వకూడదని ప్రకటించినా సంతోషించేవాడినని అన్నారు ప్రముఖ ప్రవచనకారులు చాగంటి కోటేశ్వరరావు . ఎవ్వరికి ఇచ్చినా వచ్చి తిలకించేవాడినని చాగంటి అన్నారు. 
 

ఈ ఏడాదికి గాను గురజాడ పురస్కారాన్ని ప్రముఖ ప్రవచనకారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును ఎంపిక చేసిన వ్యవహారం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కవులు, కళాకారులు, సాహితీ లోకం పెదవి విరచడంతో పాటు ధర్నాలు  సైతం చేశారు. తొలుత ఈ అవార్డ్‌ను స్వీకరించాలా వద్దా అనుకున్న చాగంటి.. తర్వాత మనసు మార్చుకున్నారు. విజయనగరంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయనకు నిర్వాహకులు గురజాడ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 

ఈ సందర్భగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. తనకు ఇచ్చింది గురజాడ పురస్కారం కాదని, వారి ఆశీస్సులన్నారు. అందుకే పురస్కారం స్వీకరించడానికి సిద్ధపడ్డానని చాగంటి కోటేశ్వరరావు స్పష్టం చేశారు. గురజాడ వారంటే తనకు భక్తి, గౌరవమన్నారు. తన ప్రవచనాల్లోనూ గురజాడ పద్యాలను ప్రస్తావించానని చాగంటి గుర్తుచేశారు. వర్తమాన కాలంలో భిన్నాభిప్రాయాలపై దృశ్యా నిర్వాహకులకు కాల్ చేశానని ఆయన తెలిపారు. తనకు ఇవ్వకూడదని ప్రకటించినా సంతోషించేవాడినని , అలాగే ఎవ్వరికి ఇచ్చినా వచ్చి తిలకించేవాడినని చాగంటి అన్నారు. 

Also REad:గురజాడ అవార్డు తీసుకొనేందుకు అంగీకరించిన చాగంటి

కాగా.. చాగంటి కోటేశ్వరరావుకు  ఈ  ఏడాది  గురజాడ పురస్కారం ఇవ్వాలని గురజాడ  సాంస్కృతిక  సమాఖ్య  నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కొందరు  వ్యతిరేకించారు.గురజాడ భావజాలానికి  వ్యతిరేకమైన భావజాలం ఉన్న చాగంటి కోటేశ్వరరావుకి ఈ  అవార్డును ఇవ్వడంపై  కవులు, రచయితలు, కళాకారులు  అభ్యంతరం  వ్యక్తం చేశారు. ఈ  నెల  27న కవులు, కళాకారులు, రచయితలు విజయనగరంలో  ర్యాలీ నిర్వహించారు. గురజాడ నివాసం  నుండి ర్యాలి నిర్వహించి  తమ నిరసనను వ్యక్తం  చేశారు.  

ఆధ్యాత్మిక  ప్రవచనాలు  చెప్పే చాగంటి కోటేశ్వరావుకి అభ్యుదయ భావజాలం  ఉన్న గురజాడ పురస్కారం  ఇవ్వడంపై అభ్యంతరం  వ్యక్తం  చేశారు. అయితే ఈ విషయమై వివాదం చేయవద్దని  సాంస్కృతిక సమాఖ్య కోరింది. గురజాడ పురస్కారాన్ని  చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడాన్ని  కొందరు వ్యతిరేకిస్తుంటే  మరికొందరు  సమర్ధిస్తున్నారు. దీంతో  ఈ అవార్డును స్వీకరించే విషయమై  నాలుగైదు రోజులుగా చాగంటి కోటేశ్వరరావు స్పందించలేదు. చివరికి  ఈ అవార్డును తీసుకొనేందుకు చాగంటి కోటేశ్వరరావు అంగీకరించారు
 

click me!