చంద్రబాబుకు కేంద్రం షాక్

First Published Jan 22, 2018, 8:48 AM IST
Highlights
  • చంద్రబాబునాయుడుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తాజాగా మరో షాక్ ఇచ్చారు.

చంద్రబాబునాయుడుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తాజాగా మరో షాక్ ఇచ్చారు. ఇప్పటికే పోలవరం విషయంలో చంద్రబాబుకు సహకరించని కేంద్రం నదుల అనుసంధానం విషయంలో కూడా దెబ్బ కొట్టింది. నదుల అనుసంధానానికి కేంద్రం నిధులివ్వదని, ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అంటూ తేల్చె చెప్పేసింది కేంద్రం. ఇప్పటి వరకూ నదుల అనుసంధానం ప్రాజెక్టుపై రాష్ట్రాలకు మద్దతుగా కేంద్రం తనవంతుగా నిధులు సమకూరుస్తుందన్నట్లుగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ఇపుడు మాత్రం తమకు సంబంధం లేదంటున్నారు.

తాజాగా గడ్కరీ చెబుతున్నదాని ప్రకారం నదుల అనుసంధానం ప్రాజెక్టు విషయంలో రాష్ట్రాలే చొరవ చూపాలన్నారు. మార్కెటింగ్, వివిధ రాష్ట్రాల మధ్య సంధానకర్తగా మాత్రమే కేంద్రం వ్యవహరిస్తుందట. నిధులు భరించేందుకు రాష్ట్రాలు సరేనంటే 6 గురు సిఎంలతో త్వరలో కేంద్రం భేటీ ఏర్పాటు చేస్తుందని చెప్పటం గమనార్హం.

నిజానికి నదుల అనుసంధానంపై చంద్రబాబునాయుడు చాలా ఆశక్తితో  ఉన్నారు. రాష్ట్రంలో కరువును తరిమేయాలంటే నదుల అనుసంధానం ఒకటే మార్గమని చెబుతున్నారు. రాష్ట్రం వద్ద డబ్బు లేదు కాబట్టి నిధుల కోసం కేంద్రంపై ఆశలు పెట్టుకున్నారు.

నదుల అనుసంధానం ద్వారా నీళ్ళు కావాలనుకున్న రాష్ట్రాలు అందుకు అవసరమయ్యే వ్యయాన్ని భరించాలంటూ గడ్కరీ స్పష్టం చేశారు. ఇప్పటికే నదీ జలాల విషయంలో వివిధ రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయ్. ఏపికి 365 రోజులూ నీళ్ళు కావాలంటే అనుసంధానం ద్వారా గోదావరి, కృష్ణా నదలు ద్వారా జలాలను తరలించటమొకటే మార్గం.

అందుకే ఒడిస్సా, ఏపి, తెలంగాణా, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో అప్పట్లో 90:10 శాతంగా నిర్ణయమైంది. తర్వాత కేంద్రం వాటాను 60:40కి తగ్గించారు. కానీ తాజాగా గడ్కరీ మాటలను బట్టి మొత్తం వ్యయంలో కేంద్రం ఒక్క రూపాయి కూడా భరించదని అర్ధమైపోయింది.  అసలే నిధుల సమస్యతో ఇబ్బదులుపడుతున్న రాష్ట్రానికి తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి.

click me!