రైలు ప్రమాదాలను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. విజయనగరం రైలు ప్రమాదంపై విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విజయనగరంలో జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైలు ప్రమాదాలు నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఈ మేరకు మమతా బెనర్జీ సోమవారం ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు. ‘‘ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొనడంతో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారు. రైళ్ల మధ్య ఘర్షణ వల్ల కంపార్ట్ మెంట్లు పట్టాలు తప్పాయి. బోగీల్లో ప్రయాణికులు నిస్సాహాయ స్థితిలో చిక్కుకున్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన పునరావృతమైన ఘటన !! మృతుల కుటుంబాలకు నా సంతాపం. సత్వర సహాయక చర్యలు అవసరం. తక్షణమే ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను. రైల్వేలు రైల్వేలు నిద్ర నుంచి ఎప్పుడు బయటపడతాయి?’’ అని ఆమె పేర్కొన్నారు.
Another disastrous rail collision, this time in Vizianagaram district in Andhra Pradesh, involving two passenger trains, and causing uptil now at least 8 deaths and injury of at least 25 more.
Frontal collisions between trains, derailment of compartments, helpless passengers…
2009 నుంచి 2011 వరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు నేతృత్వం వహించిన మమతా బెనర్జీ.. రైల్వే ట్రాక్ లపై ఇలాంటి ఘటనలను నివారించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. కాగా.. విజయనగరం రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరగా, 100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కాంతకపల్లి- అలమండ మధ్య ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఈస్ట్ కోస్ట్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను దారి మళ్లీంచింది. కొన్నింటిని రీషెడ్యూల్ చేసింది. ఘటనా స్థలంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.