వివేకా హత్య కేసు: ఈరోజు విచారణకు రాలేనన్న అవినాష్ రెడ్డి.. మరోసారి నోటీసులు జారీ చేసిన సీబీఐ..

By Sumanth Kanukula  |  First Published Mar 6, 2023, 9:59 AM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.


మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో రెండు సార్లు అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచిన సీబీఐ అధికారులు.. మరోసారి ఆయనను విచారించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తొలుత సోమవారం(మార్చి 6)వ తేదీన విచారణకు రావాల్సిందిగా అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్స్ ఉండటంతో సోమవారం విచారణకు హాజరుకాలేనని అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు సమాచారం అందించారు. 

ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు అందజేశారు. పులివెందులలోని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక, ఇదే కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు ఇదివరకే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

Latest Videos

ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న గజ్జల ఉమాశంకర్ రెడ్డికి భార్య గజ్జల స్వాతి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తాము బెదిరింపులు ఎదుర్కొంటున్నట్టుగా తెలిపారు. తన భర్త ఉమాశంకర్ రెడ్డిని, తనను చంపేస్తామని కొమ్మా పరమేశ్వర్ రెడ్డి, ఆయన కొడుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయాలు చెప్పాలంటే కూడా తనకు భయంగా ఉందని చెప్పారు. తమ కుటుంబానికి ఏదైనా జరిగితే పరమేశ్వర్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. 

‘‘శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు  పరమేశ్వర్ రెడ్డి మా ఇంటి దగ్గరకు వచ్చి నానా బూతులు తిట్టాడు. నీ భర్త ఇంటికి వచ్చాక.. వివేకానందరెడ్డిని ఎట్లా చంపారో నీ భర్తను, నిన్ను కూడా అలాగే చంపుతామని బెదిరించాడు. ఆ బూతులను నా నోటితో నేను చెప్పలేను. చంపితే దిక్కేవరు ఉన్నారని కూడా మాట్లాడాడు. కాలు చెప్పుతో కొట్టబోయాడు. నేను ఇంట్లోని వేరే గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకున్నాను. అతడి కొడుకు కూడా వచ్చాడు. అతడు కూడా చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. పక్కనే ఉన్న బీరువాల అతడు వచ్చి వారిని పంపించి వేశాడు’’ అని తెలిపారు. 

Also Read: వివేకా కేసు : మూడోసారి నోటీసులు.. రేపు విచారణకు రాలేనన్న వైఎస్ అవినాష్ రెడ్డి, సీబీఐ నిర్ణయంపై ఉత్కంఠ

అలాగే పరమేశ్వర్ రెడ్డి తన ఇంటికొచ్చిన సమయంలో తనను తోసేయడంతో దెబ్బ తగిలిందని స్వాతి తెలిపారు. ‘‘మా ఇంటికొచ్చిన సమయంలో నా సెల్ లాక్కుని తోసేశాడు. వెనకాల భాగంలో దెబ్బతగలడంతో.. ఆస్పత్రికి వచ్చాను. నిన్న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాను. వాళ్లు ఫిర్యాదు అయితే తీసుకున్నారు. ఈ విషయాలు చెప్పాలంటే కూడా భయంగా ఉంది. మళ్లీ ఏం చేస్తారనే ఆందోళన ఉంది. మా కుటుంబంలో ఏ ఒక్కరికి ఏం జరిగిన పరమేశ్వర్ రెడ్డిదే బాధ్యత’’ అని స్వాతి అన్నారు. ఇక, వివేకానందరెడ్డి హత్య కేసులో ఉమాశంకర్ రెడ్డి ఏ-3గా ఉన్నాడు. 

click me!