వివేకా హత్య కేసు: కర్నూలు ఎస్పీతో సీబీఐ అధికారుల చర్చలు.. పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ..

By Sumanth KanukulaFirst Published May 22, 2023, 9:36 AM IST
Highlights

మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోమారు విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరడంతో.. సీబీఐ అధికారులు ఈరోజు ఉదయం కర్నూలుకు చేరుకున్నారు. 

కర్నూలు: మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోమారు విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరడంతో.. సీబీఐ అధికారులు ఈరోజు ఉదయం కర్నూలుకు చేరుకున్నారు. కర్నూలులోని విశ్వభారతి ఆస్ప్రతిలో తన తల్లి లక్ష్మమ్మకు చికిత్స పొందుతుండటంతో.. అవినాష్ రెడ్డి గత నాలుగురోజులుగా అక్కడే ఉన్నారు. అయితే తాజాగా సీబీఐ అధికారులే నేరుగా కర్నూలుకు చేరుకోవడంతో ఏ విధమైన పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్రిక్తత నెలకొంది. 

కర్నూలు చేరుకున్న సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో చర్చలు జరుపుతున్నారు. శాంతి భద్రతలకు సంబంధించి సీబీఐ అధికారులు ఎస్పీతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అధికారం ఉందని సీబీఐ అధికారులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కర్నూలు ఎస్పీకి లిఖితపూర్వక సమాచారం ఇచ్చినట్టుగా సమాచారం. అయితే ప్రస్తుతం పోలీసు ఫోర్స్ కోసం సీబీఐ అధికారులు కర్నూలు ఎస్పీ కార్యాలయం  వద్ద వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది.

మరోవైపు కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివస్తున్నారు. ఒకవేళ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన పక్షంలో అడ్డుకునేందుకు వారు యత్నించే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే విశ్వభారతి ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అలాగే కర్నూలులోని ప్రధాన కూడళ్లతో పాటు.. విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లే అన్ని దారులలోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తవారిని ఎవరినీ కూడా ఆస్పత్రి వైపుకు అనుమతించడం లేదు. ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్న వైసీపీ కార్యకర్తలను కూడా తిప్పి పంపుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. అయితే మే 16, మే 19వ తేదీల్లో రెండు విచారణ తేదీలను అవినాష్ రెడ్డి దాటవేశారు.తాజా ఈరోజు(మే 22) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. మరోసారి విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ప్రస్తుతం తన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున్న విచారణకు హాజరయ్యేందుకు 5 రోజుల సమయం కావాలని  కోరారు. ఇక, ఈ నెల 19 నుంచి అవినాష్ రెడ్డి తన తల్లి లక్ష్మమ్మ చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆస్పత్రిలో ఉండిపోయారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఏప్రిల్ 16న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 
 

click me!