అంతర్వేది రధం దగ్దంపై సిబిఐ విచారణ... రెండు నెలల్లోపే: చినరాజప్ప డిమాండ్

By Arun Kumar PFirst Published Sep 11, 2020, 7:14 PM IST
Highlights

సీఎం జగన్ ఉదాసీన వైఖరి వల్ల విధ్వంస శక్తులు పథకం ప్రకారం హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి పూనుకుంటున్నాయని టిడిపి నాయకులు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. 

గుంటూరు: రాష్ట్రంలో అన్ని వర్గాల పట్ల సమభావంతో ఉండాల్సిన ముఖ్యమంత్రి హోదాలో వున్న జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వ్యవహరించడం లేదని టిడిపి నాయకులు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. దీంతో అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో హిందూ ధార్మిక క్షేత్రాలు, సంస్థలపై అనేక దాడులు జరిగాయన్నారు. జగన్ ఉదాసీన వైఖరి వల్ల విధ్వంస శక్తులు పథకం ప్రకారం హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి పూనుకుంటున్నాయని... అయినా ఇంతవరకు ఏ ఘటనలోనూ సకాలంలో కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. 

''జగన్ విధానాల వల్లే అంతర్వేదిలో రథం కాలి బూడిదైంది. లక్ష్మీ నరసింహస్వామివారి రథం గత శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత కాలి బూడిదైంది. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఏటా రథోత్సవం రోజున ఈ రథాన్ని ఉపయోగిస్తారు. రూ.94 లక్షల ఖర్చుతో పూర్తి టేకు కలపతో ఈ రథాన్ని 57 ఏళ్ల క్రితం తయారు చేశారు. ఏటా రథోత్సవంపై స్వామివారి ఊరేగింపును తిలకించి భక్తులు తన్మయత్వం పొందుతారు'' అని అన్నారు. 

''అదేవిధంగా అంతర్వేది దేవాలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. దేశ నలమూలల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారు. అలాంటి దేవాలయం నిర్వహణ పట్ల ఉదాసీన వైఖరిని ప్రదర్శించడం ప్రభుత్వ విధానాలను తేటతెల్లం చేస్తోంది. ఆలయానికి సమీపంలోని ప్రత్యేక షెడ్డులో రథాన్ని భద్రపరిచారు. అర్థరాత్రి సమయంలో రథం దగ్ధం కావడం బలమైన అనుమానాలకు తావిస్తోంది. దగ్ధానికి మొదట షార్ట్ సర్క్యూట్ అన్నారు. అక్కడ కరెంట్ కనెక్షనే లేదని తేలిన తర్వాత పిచ్చివాడి మీదకు నెట్టేశారు. అది కూడా తప్పని తేలిన తర్వాత తేనెతుట్టె మీదకు నెపం మోపారు'' అని గుర్తుచేశారు. 

read more  ఆలయాలపై దాడులకు నిరసనగా... దీపం వెలిగిస్తున్న పవన్ కల్యాణ్ (ఫోటోలు)

''టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు వెంటనే నాతో పాటు గొల్లపల్లి సూర్యారావుతో కూడిన నిజనిర్థారణ బృందాన్ని అంతర్వేది పంపించడం జరిగింది. పరిశీలించిన ఈ బృందం సీబీఐ విచారణ జరిపించాలని కోరటమైంది. రాష్ట్రమంతా భగ్గుమన్నారు. ఇప్పుడు వేడి చల్లార్చడానికి అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ప్రభుత్వం కోరతామంటున్నారు. ఇక్కడ ఒక్క అంతర్వేది కాదు.. ఇతర అన్ని ఆలయాలపైన, పూజారులపైన, సింహాచలం ఇసుక కుంభకోణం, ఆలయ భూముల కుంభకోణాలపైనా సీబీఐ విచారణ కోరాలి'' అని డిమాండ్ చేశారు. 

16 నెలల కాలంలో హిందూ దేవాలయాలపై వరుస విధ్వంసాలు


1. అంతర్వేది ఘటన మాదిరిగానే నెల్లూరు జిల్లా బోగోలు మండలం బిట్రగుంట కొండపై కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథం దగ్ధమైంది. కుట్రదారులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కనీసం కేసు కూడా నమోదుచేయలేదు. 

2. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 6 ఆలయాల్లో 23 విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఆంజనేయ స్వామి, సోమేశ్వరస్వామి, సీతారామాంజనేయ స్వామి, ముత్యాలమ్మ, కనకదుర్గ ఆలయాల్లోని విగ్రహాలను స్పల్పంగా ధ్వంసం చేశారు. ఇక్కడ కూడా పోలీసులు మతి స్థిమితం లేని వ్యక్తి పనిగా తేల్చడం అనుమానాలకు తావిస్తోంది.

3. టీటీడీ భూములను విక్రయించేందుకు కుట్ర పన్నారు. టీటీడీలో అన్యమతస్థుల నియామకం జరిగింది. బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం, తిరుమల లడ్డూను అంగడి సరకుగా మార్చడం, తిరుమల కొండపై శిలువ గుర్తు వెలవడం, టీటీడీ వెబ్‌సైట్‌లో ఏసుక్రీస్తు బోధనల పుస్తకాలు అప్‌లోడ్‌ చేయడం, దర్శనం, వసతి, అద్దె, ప్రసాద ధరలు విపరీతంగా పెంచడం, డిక్లరేషన్ పై సంతకానికి జగన్ నిరాకరణ, మైల ఉన్నప్పుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం వంటి అనేక ఘటనలు జరిగాయి. ఎస్వీబీసీ ఛైర్మన్ గా పృథ్వీరాజ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారు. టీటీడీ నిధులను దారి మళ్లించారు.

4. శ్రీశైలంలో కొండ మీద 200 పైగా చర్చిలు వెలిశాయి. టికెట్ల కుంభకోణం, శ్రీశైలం దేవస్థానం డబ్బును జగన్ రెడ్డి గ్యాంగ్ తినేశారు. ఇతర మతస్థులకు దుకాణ సముదాయాలు కేటాయించారు.

5. అన్నవరం కొండ మీద కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు యత్నించి భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారు.  

6. సింహాచలం భూములలో అక్రమ మైనింగ్, ఆస్తుల కుంభకోణం, ట్రస్ట్ లో అన్యమతస్థుల నియామకం వంటి ఘటనలు జరిగాయి. సింహాచలం భూములలో చర్చిలు కట్టారు. అర్థరాత్రి పూట 5 జీవోలు ఇచ్చి ట్రస్ట్ ఛైర్మన్ గా సంచయితను నియమించారు.

7. పట్టిసీమ వీరభద్ర స్వామి గుడికి కాలి నడకన వెళ్లే భక్తుల నుంచి రూ.20 వసూలు చేయడం, విజయవాడ ఇంద్రకీలాద్రి పై వాహనాల పార్కింగ్ ఫీజు రూ.20 నుంచి రూ.50కు పెంచడం,  కృష్ణా జిల్లా కంకిపాడు దగ్గర్లో ఉన్న మద్దూరులో హిందువులు పిండ ప్రధానాలు చేసుకునే సమయంలో పన్ను వసూలు చేయడం వంటి ఘటనలు జరిగాయి.

8. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం బుట్టాయగూడెంలో గుడిపై దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు. మరుసటిరోజు బుట్టాయగూడెం మండలం కేంద్రంలో మరో ఆలయంలో విగ్రహాలను దెబ్బతీశారు. ఈ రెండు కేసుల్లో దోషులెవరో ఇప్పటికీ తేలలేదు.

9. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో అమ్మవారి దేవాలయం ముఖ ద్వారం కూల్చివేశారు.

10. గుంటూరు నగరంలో ఆదిశక్తి ఆలయాన్ని హుటాహుటిన కూల్చివేశారు. గుడిలో ఉన్న వస్తువులను కూడా తీసుకునే అవకాశం ఇవ్వలేదు. 

11. కాణిపాకం దేవస్థానానికి చెందిన సత్రాన్ని క్వారంటైన్‌ కేంద్రంగా మార్చారు. అందులో ఇతర మతస్తులకు వసతి కల్పించారు. 

12. ప్రకాశం బ్యారేజి సమీపంలో ఉన్న విజయేశ్వర స్వామి గుడి కూల్చివేశారు. 

13. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేత క్రైస్తవ మతానికి చెందిన పాటలు పాడించారు.

14. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహం కూల్చివేశారు.

15. నెల్లూరు జిల్లా బోగోలు మండలం, తిరువీధిపాడు నరసింహస్వామి దేవాలయానికి చెందిన భూమి ఇళ్ళ పట్టాలకు కేటాయించారు.  

16. ద్వారక తిరుమల దేవాలయం ఆస్తుల విక్రయాలు

17. తిరుమల, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం

18.  ప్రభుత్వ కార్యక్రమాలకు దేవాదాయశాఖ నిధుల మళ్లింపు

19. అన్యమతస్థులకు హిందూ దేవాలయాల్లో ఉద్యోగాలు కల్పన 

20. తిరుమల, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో వైసీపీ నేతల రాజకీయ ప్రచారం చేశారు.

''ఈ 16 నెలల కాలంలో హిందూ దేవాలయాలపై జరిగిన విధ్వంస ఘటనలు, అక్రమాలపైనా సమగ్ర దర్యాప్తు జరిపించాలి. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ 2 నెలల్లో పూర్తిచేయాలి. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై న్యాయం చేయాలని డిమాండ్ చేసిన వారిపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకుని బేషరతుగా విడుదల చేయాలి'' అని నిమ్మకాయల డిమాండ్ చేశారు. 


 

click me!