వైఎస్ వివేకా హంతకులను పట్టిస్తే రూ. 5 లక్షల నజరానా: సీబీఐ ప్రకటన

By telugu teamFirst Published Aug 21, 2021, 10:03 AM IST
Highlights

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కొలిక్కి వచ్చినట్లే కనిపించింది. అయితే, సిబిఐ తాజా ప్రకటనతో దానిపై అనుమానాలు కలుగుతున్నాయి. వైఎస్ వివేకా హంతకుల సమాచారం ఇస్తే నజరానా ఇస్తామని సిబిఐ ప్రకటించింది.

కడప: మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైఎస్ వివేకాను హత్య చేసినవారిని పట్టిస్తే రూ. 5 లక్షల నజరానా ఇస్తామని సిబిఐ ప్రకటించింది. నిందితుల ఆచూకీ తెలపాలని సిబిఐ ఆ ప్రకటనలో కోరింది. 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చిందని అనుకుంటున్న సమయంలో సిబిఐ ఆ ప్రకటన చేసింది. దాంతో అది చర్చకు దారి తీసింది. ఈ కేసులో సిబిఐ ఇప్పటికే సునీల్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. నిందితులకు సంబంధించిన పక్కా సమాచారం అందించినవారికి మాత్రమే అవార్డు ఇస్తామని సిబిఐ ప్రకటించింది. సమాచారం ఇచ్చినవారి పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పింది.

వందల మందిని విచారించింది. దాదాపు 70 రోజులుగా దర్యాప్తు సాగిస్తోంది. సిబిఐ తాజా ప్రకటనతో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ముందుకు సాగలేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు విజ్ఞప్తితో సిబిఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించారు.

అలాగే, సునీల్ యాదవ్ సమీప బంధువు భరత్ యాదవ్ ను కూడా సిబిఐ అధికారులు విచారించారు. పులివెందులకు చెందన మహబూబ్ బాషాను, నాగేంద్రను, మరో వ్యక్తిని సిబిఐ అధికారులు విచారించారు. 

2019 మార్చి 14వ తేదీ రాత్రి తన ఇంట్లోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఉంది. ఎన్నికల సమయంలో ఈ హత్య జరగడంతో తీవ్ర దుమారం చెలరేగింది.

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణను సునీత కోరడం కూడా సంచలనంగా మారింది. జగన్ ప్రభుత్వ హయాంలోనే వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సిబిఐ చేపట్టింది.

click me!