పవన్ కల్యాణ్ పై మానవహక్కుల కమిషన్ లో కేసు..

By SumaBala BukkaFirst Published Oct 19, 2022, 8:43 AM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జాతీయ మానవహక్కుల కమిషన్ లో కేసు నమోదయ్యింది. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడని కేసు వేశారు. 

గుంతకల్లు : వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నంలో చేపట్టిన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కేసు నమోదు అయ్యిందని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ తెలిపారు. మంగళవారం ఆయన అనంతపురం జిల్లా గుంతకల్లులో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. విశాఖ ఘటన ద్వారా రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు ప్రయత్నించిన పవన్ కళ్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశామని అన్నారు. కమిషన్ తమ ఫిర్యాదుకు స్పందించి విచారణకు స్వీకరించింది అని తెలిపారు.

కాగా, అక్టోబర్ 16న విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రులు, వైసీపీ నాయకులపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జనసేన నాయకులను బాధ్యులను చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. కోన తాతారావు, పీతల మూర్తి యాదవ్, విశ్వక్ సేన్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, శివప్రసాద్ రెడ్డి, పివిఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నీయక్, కీర్తీస్, పాలవసల యశస్విని, గేదెల చైతన్య, పట్టిమ రాజును పోలీసులు అరెస్టు చేశారు.

విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి : ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు

విమానాశ్రయంలో సిసిటివి ఫుటేజీ ఆధారంగా దాడికి ప్రయత్నించిన వారిని గుర్తించి సెక్షన్ 307తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మంత్రి రోజా,  తదితర వైసిపి నాయకులు విమానాశ్రయానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు వారిని దూషించి, రాళ్లతోనూ, పార్టీ జెండా కర్రలతోనూ,  పదునైన ఇనుప వస్తువులతోనూ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అక్కడ ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కూడా జరిగిందని తెలిపారు.

నోవాటెల్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బసచేసిన ఫ్లోర్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పవన్ బస చేసిన హోటల్ చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. ఏసిపి హర్షితచంద్ర నేతృత్వంలో హోటల్ చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. నోవాటెల్ వద్ద భద్రతను నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, క్రైమ్ డీసీపీ నాగన్న పరిశీలించారు. పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్లమనోహర్, నాగబాబు నోవాటెల్ లో బస చేశారు. హోటల్ సమీపంలో 100 మీటర్ల  పరిధిలో జనసంచారం లేకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. నోవాటెల్ వైపు వచ్చే అభిమానులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

కాగా, అక్టోబర్ 17న విశాఖ విమానాశ్రయం వద్ద ఏపీ మంత్రులపై దాడి ఘటనలో అరెస్టైన జనసేన నాయకులు, కార్యకర్తలకు న్యాయస్థానంలో ఊరట లభించింది. అరెస్టైన  61 మందిని రూ. పదివేల పూచీకత్తుపై కోర్టు వారిని విడుదల చేసింది. మరో తొమ్మిదిమందికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. తొమ్మిది మందిపై 307 సెక్షన్ తొలగించి 326 సెక్షన్ గా మార్చి రిమాండ్ విధించారు. అంతకు ముందు హైడ్రామా మధ్య పోలీసులు జనసేన నేతలను ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. 

వారిని కోర్టుకు తీసుకు వచ్చే సమయంలో ప్రాంగణం అన్ని గేట్లు దిగ్బంధం చేశారు మరోవైపు 92 మంది జనసైనికులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు జనసేన లీగల్ సెల్ పేర్కొంది. అరెస్టు చేసిన వారిలో 9 మంది పార్టీ నేతలకు రిమాండ్ విధించారని, 61మంది జనసైనికులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు జనసేన తెలిపింది.

click me!