
గుంటూరు : గుంటూరు నగరంలో జనం అందరూ చూస్తుండగానే మంగళవారం రాత్రి ఓ వ్యక్తిని నడిరోడ్డులో వెంటాడి కత్తులు, వేటకొడవళ్లతో దుండగులు నరికి చంపేశారు. ప్రాణాలు కాపాడుకోవడానికి స్థానికంగా ఉన్న ఓ కిరాణా షాప్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యువకుడు దాక్కున్నాడు. ఆ షాప్ లోకి వెళ్లి మరీ మట్టు పెట్టారు. దాంతో ఆ ప్రాంతంలోని వ్యాపార వర్గాలు, షాపింగ్ పనుల మీద బజార్ కు వచ్చిన వారంతా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.
పట్నంబజార్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సమీపంలోని బాబు హోటల్ వద్ద (ఏటుకూరు రోడ్డు) సుమారు రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు నల్లచెరువు ఆరో లైన్ కు చెందిన దొడ్డి రమేష్(38)గా గుర్తించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఫైనాన్స్ వ్యాపారంతో పాటు శుభకార్యాలకు డెకరేషన్ పనులు చేస్తారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు నిందితుల కోసం నగరంలో జల్లెడ పడుతున్నాయి.
భార్యపై అనుమానం.. ఏడాదిన్నర కుమార్తెని బావిలో పడేసిన తండ్రి.. చివరికి...
హత్యకు ముందు రమేష్ ఇంట్లోనే ఉన్నాడని, స్నానానికి నీళ్లు పెట్టెలోగా ఎవరు ఫోన్ చేసి పిలవగా.. బయటకు వచ్చి హత్యకు గురయ్యాడని మృతుడి తల్లి విలపిస్తూ చెప్పారు. రమేష్ పై గుంటూరు లాలాపేట స్టేషన్లో రౌడీషీట్ (ఏ కేటగిరి) ఉంది. గతంలో పాత గుంటూరులోని చాకలి గుంట వద్ద జరిగిన ఓ హత్య కేసులో ఇతను నిందితుడని పోలీసులు తెలిపారు కాగా, తన భర్తను బుడంపాడుకు చెందిన రౌడీషీటర్ ఆర్కే హత్య చేశాడని రమేష్ భార్య ఆరోపించారు. తన భర్తకు ప్రాణభయం ఉందని మొరపెట్టుున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు.