
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుంది. అసెంబ్లీలో జరిగిన వ్యవహారాలను చూసిన వారికి ఎవరికైనా కూడా జగన్ సభ నుండి ఎందుకు వెళ్లిపోయారో అర్ధం కావటం లేదు. అధికారపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనలేకే జగన్ సభ నుండి పారిపోయాడని టిడిపి ఎగతాళి చేసేందుకు స్వయంగా జగనే అవకాశం ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాదితుల గురించి జగన్ మాట్లాడుతూ ప్రత్తిపాటి పుల్లారావు భార్య కూడా భూములను కొనుగోలు చేసిందని చేసిన ఆరోపణలతో సభలో వ్యవహారాలు పూర్తిగా పక్కదారిపట్టాయి.
భూములు కొనుగోలు చేసినట్లు నిరూపించాలని ప్రత్తిపాటి సవాలు విసిరారు. ఎటువంటి విచారణకైనా సిద్ధమేనంటూ చెప్పారు. హౌస్ కమిటితో విచారణ చేయించినా అభ్యంతరం లేదన్నారు. అందుకు జగన్ ధీటుగా స్పందించాలేకపోయారు. తన వద్ద తగిన ఆధారాలుంటేనే జగన్ ఆరోపణలు చేయాలి. లేకపోతే మాట్లాడనేకూడదు. అటువంటిది ఆరోపణలు చేసినపుడు నిలబడాలి. జగన్ ఏదీ చేయలేకపోవంటతో పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు. దాన్ని టిడిపి అవకాశంగా తీసుకున్నది.
కొంతసేపటికి జగన్ మాట్లాడుతూ జ్యుడీషియల్ విచారణ చేయించాలని డిమాండ్ చేసారు. దానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. అయితే, విచారణలో జగన్ ఆరోపణలు తప్పని నిరూపణైతే జగన్ను సభ నుండి వెలేస్తామని చంద్రబాబు అన్నారు. ఒకవేళ ప్రత్తిపాటి తప్పు చేసారని తేలితే సభ నుండి ప్రత్తిపాటిని వెలేయటానికి తాము సిద్ధమని చంద్రబాబు చేసిన సవాలుకు జగన్ సమాధానం చెప్పలేకపోయారు. దాంతో సభలో తీవ్ర గందరగోళం మొదలైంది.
అదే సమయంలో స్పీకర్ మాట్లాడుతూ, మహిళా పార్లమెంటేరియన్ సదస్సు సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను కూడా జగన్ మీడియా వక్రీకరించి మనస్ధాపికి గురిచేసిందన్నారు. తనపైనే కాకుండా తన కుటుంబంపైన కూడా దుష్ర్పచారం చేయటం మరింత బాధ కలిగిందన్నారు. దాంతో మీట్ ది ప్రెస్ లో తాను మహిళల గురించి చేసిన వ్యాఖ్యలను సభలో వినిపించాలని అన్నారు. దాంతో స్పీకర్ వ్యాఖ్యలను సభలో వినిపించారు. అయితే, అప్పటికే వైసీపీ సభ నుండి వాకౌట్ చేసింది.
సభ నుండి వెళ్ళిపోయేబదులు సభలోనే ఉండి తమ ఎంఎల్ఏ రోజా సస్పెన్షన్ వ్యవహారాన్ని ప్రస్తావించాల్సింది. సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన రోజాను అరెస్టు చేసిన విషయం ప్రస్తావించి ఉంటే బాగుండేది. పైగా సదస్సు సందర్భంగా స్పీకర్ చేసిన వ్యాఖ్యలను మిగిలిన మీడియా కూడా ప్రసారాలు చేసింది. ఆ విషయాలను జగన్ సభలోనే ఉండి చెప్పివుంటే బాగుండేది. అదేమీ చేయకుండా సభ నుండి వెళ్లిపోవటంతో జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న అభిప్రాయం కలుగుతోంది.