
అమరావతి: అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ళ సమయం వుండగానే అధికార, ప్రతిపక్షాలు ప్రజాక్షేత్రంలోకి దూకుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇకపై ప్రజల్లోనే వుండాలని నిర్ణయించుకుని పుట్టినరోజు నుండే ఆ పని ప్రారంభించారు. ఇక ఈ మూడేళ్లు పాలనపై దృష్టిపెట్టిన సీఎం జగన్ ఇకపై పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వైసిపి ప్రభుత్వ పనితీరు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి ప్రజలకు వివరించేందుకు స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగుతున్నారు. మంత్రివర్గ విస్తరణ, జిల్లాల పునర్విభజన వంటి కీలకమైన పనులు పూర్తిచేసుకున్న జగన్ జిల్లాల బాట పట్టనున్నారు.
ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది వైసిపి ప్రభుత్వం. ఇప్పటికే ఏపీఎస్ ఆర్టిసి అధికారులకు ప్రభుత్వం నుండి ఆదేశాలు అందడంతో సీఎం పర్యటన కోసం ఉపయోగించేందుకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్దం చేస్తున్నారు. మొదటిసారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సీఎం జగన్ వినియోగించనున్నారు.
2009, 2015లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే భద్రతా కారణాలు దృష్ట్యా ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లోనే జిల్లా పర్యటన సాగించాలని అధికారుల సూచనను జగన్ అంగీకరించారు. దీంతో సీఎంవో కార్యాలయం నుండి ఆర్టిసికి బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్దంగా వుంచాలని ఆదేశాలు అందాయి. ఈ క్రమంలోనే తాజాగా బస్సుల సామర్థ్యాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తనిఖీ చేశారు. ఎలాంటి లోపాలు లేకుండా బస్సులను సిద్దం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొంతకాలానికే కరోనా మహమ్మారి విజృంభించింది. దీంతో సీఎం కేవలం క్యాంప్ కార్యాలయానికి మాత్రమే పరిమితమవ్వాల్సి వచ్చింది. రెండేళ్లు ఇలాగే గడిచిపోగా ఇటీవలే పరిస్థితి అదుపులోకి వచ్చింది. దీంతో ఇక ఈ రెండేళ్లు ప్రజల్లోనే వుంటూ పార్టీని బలోపేతం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. తద్వారా మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు.
ఇక ఇప్పటికే వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రజల్లో వుండాలని పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్ ఆదేశించారు. జిల్లాల అధికారులు కూడా గ్రామ సచివాలయాలను ఎప్పటికప్పుడు సందర్శించాలని ఆయన ఆదేశించారు. జిల్లాల పర్యటన సందర్భంగా తాను ఎప్పుడు, ఎక్కడికి వచ్చి ప్రజలను ప్రశ్నించినా ఏ సమస్యా తన దృష్టికి రావద్దని సూచించారు. ప్రజలు సమస్యల గురించి చెప్పారంటే మీరు సరిగ్గా పనిచేయనట్లేనని అన్నారు.
ఇలా 2014ఎన్నికల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు తాను కూడా ప్రజాక్షేత్రంలో వుండాలని జగన్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే అతి త్వరలో జిల్లాల పర్యటనకు సిద్దమయ్యారు. ఇలా ఏదో ఒక కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజల్లో వుండాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
ఇదిలావుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటినుండే ప్రజల్లో వుండాలని భావిస్తున్నారు. నిన్న(బుధవారం) తన పుట్టినరోజును ప్రజల మధ్యలోనే జరుపుకున్నారు. ఇలా 73వ వసంతంలోకి అడుగుపెట్టిన వెంటనే మరోసారి టిడిపి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసారు. ఇప్పటినుండే నిత్యం ప్రజాక్షేత్రంలో వుంటూ వైసిపి పాలన ఎలా సాగుతుందో వారికి వివరించాలనుకుంటున్నారు. ఇందులోభాగంగానే బుధవారం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగుడెంలో చంద్రబాబు పర్యటించారు.