
ఆంధ్రప్రదేశ్‌లో 2024లో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందుకోసం పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నాయి. ఎన్నికలకు సాధారణంగా ఆరు నెలలు లేదా ఏడాది ముందు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాయి. అయితే ఏపీలోని అధికార వైసీపీతో పాటుగా ప్రతిపపక్ష పార్టీలు ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలను ప్రారంభించాలని చూస్తున్నాయి. దీంతో ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ఏపీలో రాజకీయ వేడి ప్రారంభం కానుంది. ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్దం కావాలని చూస్తున్న పార్టీలు.. నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నాయి.
ఈ క్రమంలోనే వైసీపీ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించగా, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం 26 జిల్లాల్లో ఏడాదిపాటు పర్యటన ప్రారంభించింది. వైసీపీ విషయానికి వస్తే.. అధికారం చేపట్టిన తర్వాత పాలనకే సమయం కేటాయించిన సీఎం జగన్.. కొంతకాలంగా పార్టీని మరింతగా బలోపేతం చేసేలా దృష్టి సారించారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణతో చేయడంతో పాటుగా పార్టీ జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల నియామకాల చేపట్టారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈ క్రమంలోనే గడప గడపకు వైసీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గడప గడపకు వైసీపీలో భాగంగా నెలలో కనీసం 10 గ్రామ సచివాలయాలను సందర్శించాలని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వాలని సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు.
మరోవైపు కోవిడ్ కారణంగా క్యాంపు కార్యాలయంలో సమీక్షలు, వర్చువల్ ప్రారంభాలకే పరిమితమైన సీఎం జగన్.. ఇప్పుడూ ఆ కరోనా కేసులు తగ్గడంతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ క్రమంలోనే పలు ప్రారంభోత్సవాలు, బహిరంగ కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరవుతున్నారు. ఏప్రిల్ 7న నరసరావుపేటలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై దొంగలు, రాక్షసుల గుంపు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతే కాకుండా తన తండ్రి దివంగత వైఎస్సార్ మాదిరిగానే జనంతో మమేకమయ్యేలా సీఎం జగన్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.
టీడీపీ విషయానికి వస్తే.. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు పార్టీ పరంగా సమీక్షలు జరిపారు. అయితే ఇక నుంచి ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మే నెల నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనలు ఉండనున్నాయని సమాచారం. బాదుడే బాదుడు పేరుతో టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న నిరసనల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. మే నెలలో నిర్వహించనున్న మహానాడు తర్వాత చంద్రబాబు జిల్లాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు. ఇక, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది పాటు ప్రజల్లో ఉండే విధంగా లోకేష్ యాత్రకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.