పయ్యావుల వ్యాఖ్యలపై అధికార పక్షం ఫైర్.. అసెంబ్లీలో వీడియోల ప్రదర్శన.. ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేసిన స్పీకర్..

Published : Mar 15, 2023, 02:46 PM IST
పయ్యావుల వ్యాఖ్యలపై అధికార పక్షం ఫైర్.. అసెంబ్లీలో వీడియోల ప్రదర్శన.. ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేసిన స్పీకర్..

సారాంశం

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన సమయంలో నేరుగా డయాస్‌ మీదకు తీసుకు రాకుండా ఆయనను వెయిట్ చేయించారని పయ్యావుల కేశవ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. పయ్యావుల కామెంట్స్‌పై అసెంబ్లీలో చర్చను అధికార పక్షం లెవనేత్తింది. పలువురు వైసీపీ సభ్యులు కూడా ఈ విషయంపై మాట్లాడారు. ఈ క్రమంలోనే పయ్యావుల కామెంట్స్‌‌ను నిజం లేదంటూ.. అసెంబ్లీలో అధికార పక్షం వీడియోను ప్రదర్శించింది. పత్రికల్లో కూడా ఇందుకు సంబంధించిన అసత్య వార్తలు వచ్చాయని తెలిపింది. గవర్నర్‌ ప్రసంగంపై కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది.

ఈ సందర్బంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. టీడీపీవి  అన్ని తప్పుడు ఆరోపణలు అని విమర్శించారు. గవర్నర్‌పై, శాసనసభపై అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అవాస్తవ ప్రచారాలపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. టీడీపీ సభ్యుల వ్యవహారశైలి సభా హక్కుల ఉల్లంఘేనని అన్నారు. 

ఈ క్రమంలోనే అధికార పక్షం కామెంట్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పయ్యావుల కేశవ్.. గవర్నర్‌ను నేరుగా వేదిక మీదకు తీసుకురాకుండా వేచి ఉండేలా చేశారని తాను మాట్లాడనని చెప్పారు. రాష్ట్రపతిని పార్లమెంట్‌లో ప్రసంగించే సమయంలో స్వాగతించే విషయంలో పాటించాల్సిన నిబంధనలను తాను చదవి వినిపించానని చెప్పారు. ఆ నిబంధనలను సభలో కూడా చదివి వినిపించారు. ‘‘గవర్నర్‌ను నేరుగా డయాస్ మీదకు తీసుకురావాలి.. మీరు స్పీకర్ చాంబర్‌లో వెయిట్ చేయించారు.. అది రాజ్యాంగ విరుద్దమని చెప్పాను. నేను నా స్టాండ్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను’’ అని పయ్యావుల పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి ఈనాడు అంటే వెన్నులో వణుకు అని విమర్శించారు. 

ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ.. గవర్నర్ ఆఫీసు నుంచి ఆయనను తీసుకెళ్లాలనే దానిపై డైరెక్షన్ వచ్చిందని చెప్పారు. దానిని సభలో చదివి వినిపించారు. దానిని హౌస్‌లో పెట్టాలని టీడీపీ డిమాండ్ చేయగా.. ఆ అవసరం లేదని స్పీకర్ తమ్మినేని అన్నారు. కూర్చొండని టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పేపర్ హౌస్‌కు కాదని.. తమకు ఇచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. ఈ మధ్య ప్రెస్‌మీట్ పెట్టి ఏది పడితే అది మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు. టీడీపీ సభ్యులు వితండ వాదన చేస్తున్నారని అన్నారు. తప్పుడు  ఆరోపణలు చేసినవారితో పాటు అసత్య ఆరోపణలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని.. ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని స్పీకర్‌ను కోరారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన స్పీకర్ తమ్మినేని సీతారామ్.. గవర్నర్ కార్యక్రమంలో తాను కూడా ప్రత్యక్ష సాక్షినని అన్నారు. సీఎం, మండలి చైర్మన్, స్పీకర్‌గా తాను, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి.. అందరం కూడా వెళ్లి గవర్నర్‌ను సగౌరవంగా రిసీవ్ చేసుకోవడం జరిగిందని చెప్పారు. రిసీవ్ చేసుకున్న తర్వాత ఛాంబర్‌కు వచ్చి.. థ్రోట్ అలర్జీ ఉందని హాట్ వాటర్ తీసుకుని బయలుదేరానని చెప్పారు. ఎలాంటి డీవియేషన్ జరగలేదని అన్నారు. అయితే ఇందుకు సంబంధించి ఈనాడు పేపర్‌లో చూసిన తర్వాత దీనిని సీరియస్‌గా తీసుకోవాల్సిందేనని భావించామని చెప్పారు. సభ కూడా అదే కోరుకుంటుందని తెలిపారు. ఈ పరిణామాలను సభ తీవ్రంగా పరిగణిస్తోందని.. దీనిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని అన్నారు. ప్రివిలేజ్ కమిటీకి దీనిని రిఫర్ చేస్తున్నామని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?