తప్పుడు ప్రచారం చేస్తారా: ఈసి రమేష్ కుమార్ ను నిలదీసిన బుగ్గన

By telugu teamFirst Published Mar 21, 2020, 11:51 AM IST
Highlights

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలిని ఎపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నానని సీఎంపై తప్పుడు ప్రచారం చేస్తారా అని అడిగారు.

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి తప్పుడు ప్రచారం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. 

రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం సరి కాదని ఆయన అన్నారు. ఆరోగ్య శాఖను సంప్రదించకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేస్తారా అని ఆయన ఈసీని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా ఏ స్థితిలో ఉందో ఈసీ తెలుసుకున్నారా అని ఆయన అడిగారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. 

కేంద్రానికి లేఖ రాశారా లేదా అని చెప్పడానికి ఈసీ ఎందుకు ముందుకు రాలేదని ఆయన అడిగారు. కేంద్రానికి లేఖ రాయడానికి ముందు భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత సంస్థలన్నింటినీ సంప్రదించి రమేష్ కుమార్ కు భద్రత కల్పించిందని ఆయన చెప్పారు. 

కరోనా వైరస్ వల్ల ఎన్నికలను వాయిదా వేస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎలా అమలులో ఉంటుందని ఆయన అడిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఎక్కువ స్థానాలు గెలువడం సర్వసాధారణమని ఆయన అన్నారు. ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు రాకపోతే మంత్రి పదవులు పోతాయని తప్పుడు ప్రచారం చేస్తారా అని అడిగారు. తనకు కొమ్ములు వచ్చాయా లేదా అనేది తర్వాత విషయమని, చంద్రబాబు ఆలోచనా సరళి సరిగా లేదని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల స్ఫూర్తిని పరిశీలిస్తే రమేష్ కుమార్ వ్యవహరించిన తీరు సరి కాదనేది అర్థమవుతోందని ఆయన అన్నారు. నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి తాము దాన్ని వ్యతిరేకించడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డు ఉండకూడదని చెప్పిందని ఆయన గుర్తు చేశారు

ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని ఈసీ తప్పుడు ప్రచారం చేసిందని ఆయన అన్నారు. టీడీపీ వాళ్లు నామినేషన్లు వేయకపోతే వైసీపీ బాధ్యత వహించాలా అని అడిగారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా వ్యవహరించడం పరిపాటి అని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ వ్యాఖ్యలనే తీసుకుని కరోనా వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు సరి కాదని ఆయన అన్నారు. కరోనా వైరస్ కట్టడికి జగన్ పలు చర్యలు ప్రకటించారని ఆయన చెప్పారు. జ్వరం వస్తే పారాసిటిమాల్ వేసుకోరా అని అడిగారు. 

click me!