కేసీఆర్ తో టచ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ... రేవంత్ సర్కార్ ను కూల్చే కుట్ర..: బండి సంజయ్ సంచలనం

By Arun Kumar PFirst Published Jan 14, 2024, 2:21 PM IST
Highlights

 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కేసీఆర్ స్కెచ్ వేస్తున్నాడని బిజెపి ఎంపీ సంజయ్ అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్ కూలే ప్రమాదం వుందని సంజయ్ సంచలన  వ్యాఖ్యలు చేసారు. 

కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని బిజెపి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా రేవంత్ సర్కార్ కూలే ప్రమాదం వుందన్నారు. కాంగ్రెస్ లో కొందరు కేసీఆర్ కోవర్టులు వున్నారని ... వాళ్లద్వారానే ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ భారీఎత్తున నిధులు ఇచ్చి కోవర్టులుగా మార్చుకున్నాడని బండి సంజయ్ అన్నారు. 

ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కేసీఆర్ స్కెచ్ వేస్తున్నాడని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది ఇప్పటికే కేసీఆర్ టచ్ లో వున్నారన్నారు.  మందికి పుట్టినోళ్ళు కూడా తన పిల్లలే అనుకునే రకం కేసీఆర్ అని మండిపడ్డారు. ఇప్పటికే ఎమ్మెల్యేలతో కేసీఆర్ బేరసారాలు సాగుతున్నాయి ... ప్రభుత్వాన్ని కూల్చి ఇదంతా బిజెపి చేసిందని బదనాం చేస్తారని సంజయ్ అన్నారు.

ఇక అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్షింతలు పంచే కార్యాక్రమంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ కు సంజయ్ కౌంటర్ ఇచ్చారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తర్వాత తాముకూడా ఇలాగే అక్షింతలు పంచితే అధికారంలోకి వచ్చేవారిమని కేటీఆర్ అంటున్నారు... వారిని పంచొద్దని ఎవరన్నారు? అని నిలదీసారు. భద్రాద్రి రామయ్యకు తలంబ్రాలు కూడా తీసుకురానోళ్లు... వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలకు నిధులిస్తామని మోసం చేసినోళ్లు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. బిఆర్ఎస్ నాయకులకు బిజెపి, హిందువుల గురించి మాట్లాడే అర్హత లేదని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

Also Read  నామినేటేడ్ పదవుల భర్తీకి రేవంత్ కసరత్తు:కోదండరామ్‌కు ఎమ్మెల్సీ?

తెలంగాణ ప్రజలు కేవలం నెల రోజులకే కేసీఆర్ ను పూర్తిగా మరిచిపోయారని సంజయ్ ఎద్దేవా చేసారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే మరోసారి బయటకు వచ్చేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు... కానీ ఆయన లోపలున్నా, బయటున్నా మారేదేమీ లేదన్నారు. అసలు తెలంగాణలో పోటీ చేసేందుకే బిఆర్ఎస్ కు అభ్యర్థులు లేరు... మరి దేశవ్యాప్తంగా ఎవరిని పోటీ చేయిస్తారని ప్రశ్నించారు. బిఆర్ఎస్ జాతీయ పార్టీ అంటున్నారుగా... మరి దేశంలో ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. అసలు బిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీనా లేక జాతీయ పార్టీనా అన్నది అర్థంకావడం లేదని సంజయ్ అన్నారు. 

రాష్ట్రంలో ఎవరు అధికారంలో వున్నా కేంద్రలో మాత్రం బిజెపియే అధికారంలో వుండాలని... ప్రధానిగా నరేంద్ర మోదీ వుండాలని ప్రజలు కోరుకుంటున్నారని సంజయ్ అన్నారు. బిజెపి ఎంపీలు ఎక్కువమంది గెలిస్తేనే తెలంగాణకు ఎక్కువ నిధులు తీసుకురాగలమని అన్నారు. లోక్ సభ ఎన్నికలకు బిజెపి సన్నద్దం అవుతోందని సంజయ్ తెలిపారు. 

click me!