
BRS in Andhra Pradesh: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి భారత రాష్ట్ర సమితిగా మారింది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణ కోసం భారీ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి మొదట పలు రాష్ట్రాల్లో తెలుగువారు ఉండే ప్రాంతాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించి బీఆర్ఎస్ అక్కడ పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తన క్యాడర్ ను పెంచుకునే పనిలో పడింది.
ఏపీలో దూకుడుగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్.. పలువురు రాజకీయ నాయకులతో పాటు వివిధ సంఘాలు, వివిధ వర్గాలు, గ్రూపుల నాయకులను పార్టీలోకి చేర్చుకుంటూ విస్తరిస్తోంది. తాజాగా పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిలో క్రిస్టియన్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు షర్మిలా సంపత్, ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ మీనా కుమారి ఉన్నారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకువస్తున్న పథకాలు, చేస్తున్న పనులు, కృషిని తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు నేతలు భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు నేతలను ఏపీ బీఆర్ఎస్ అధినేత తోట చంద్రశేఖర్ హైదరాబాద్ లో తమ పార్టీలో చేర్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో క్రిస్టియన్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు షర్మిల సంపత్, ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ మీనాకుమారి ఉన్నారు. చంద్రశేఖర్ తన నివాసంలో వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏపీ బీఆర్ఎస్ యూనిట్ ఆంధ్రాలో విస్తరించడానికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నదనీ, దానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ చెప్పారు. ఏపీలో ప్రజలు మార్పు, అభివృద్ధిని కోరుకుంటున్నారనీ, బీఆర్ఎస్, తెలంగాణ మోడల్ అభివృద్ధితో మమేకం అవుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదుగుతోందని కూడా ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ తోనే అభివృద్ది..
అంతకుముందు రోజు ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి బీఆర్ఎస్ చాలా అవసరమని అన్నారు. బీజేపీ సర్కారుకు భయపడి చాలా పార్టీలు వెనక్కి తగ్గుతున్నాయని పేర్కొన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల హక్కుల కోసం బీజేపీపై పోరుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ తోనే అభివృద్ది సాధ్యమవుతుందని తెలిపారు.