
తిరుపతి : తన ఫిట్నెస్ రహస్యం బ్రాహ్మణే అంటూ భార్యని ఆకాశానికి ఎత్తేశాడు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తిరుపతిలో ‘హలో లోకేష్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భార్య గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. తను బరువు తగ్గి, ఫిట్ గా ఉండడానికి.. తన విజయరహస్యం తన భార్య అంటూ చెప్పుకొచ్చాడు. అంతకుముందు ఆహారం మీద నియంత్రణ ఉండేది కాదని ఏదేపడితే అది తినేసేవాడినని చెప్పాడు. కోవిడ్ సమయంలో రెండేళ్ల పాటు ఇంట్లోనే ఉండడంతో.. బ్రాహ్మిణి తనమీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని.. పొద్దున్నే లేపి పరిగెత్తించేదని.. ఆహారపు అలవాట్లను కూడా చాలావరకు నియంత్రించిందని చెప్పారు. ఇక కొడుకు దేవాన్ష్ గురించి మాట్లాడుతూ.. దేవాన్ష్ పుట్టినప్పుడు అతడిని చేతుల్లోకి తీసుకోవడం తనకు బాగా గుర్తుండి పోయే రోజు అని చెప్పుకొచ్చాడు. తన కంట్లో నుంచి తెలియకుండానే ఆనంద భాష్పాలు వచ్చాయన్నాడు.
శుక్రవారం తిరుపతిలో యువగళం పాదయాత్రలో భాగంగా.. ‘హలో లోకేష్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థాయిలో నిలవాలని.. పేదరికం లేని రాష్ట్రం రూపొందాలంటే ఒక్కో జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేయాలని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమం ఒక్కటే చాలదని.. అభివృద్ధి కూడా అవసరమని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా యువత లోకేష్ ను పలు ప్రశ్నలు అడిగింది. వారందరికీ ఓపికగా లోకేష్ సమాధానాలు ఇచ్చాడు.
నంద్యాలలో పరువుహత్య.. భర్త దగ్గరికి వెళ్లడంలేదని కూతురిని చంపి.. తల, మొండెం వేరు చేసిన తండ్రి...
లోకేష్ మాట్లాడుతూ ‘అర్హులందరికీ ఉద్యోగం కల్పించడమే జగన్కు మేమిచ్చే రిటర్న్ గిఫ్ట్ అని, మాట తప్పి మడమతిప్పిన వ్యక్తికి అదే తగిన గుణపాఠం’ అని చెప్పుకొచ్చాడు. విద్య, వసతి దీవెన పథకాలు దరిద్రపు పథకాలు. గతంలో ప్రభుత్వ కళాశాలలకే ఈ ఫీజు నేరుగా వెళ్ళేది. ఇప్పుడు దానికి పేరు మార్చి అమలు చేస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపకార వేతనాలను పాత విధానంలోనే అందిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లో తిరిగి తెరుస్తామని చెప్పాడు.
ఈ కార్యక్రమంలో యువత అడిగిన పలు రాజకీయ, వ్యక్తిగత అంశాల మీద రకరకాలుగా లోకేష్ స్పందించాడు. విజయసాయిరెడ్డి మీద కూడా విరుచుకుపడ్డారు. పింక్ డైమండ్ ను మేము కొట్టేసాం అని ఆయన ఆరోపించారు. అది ఎక్కడుందో వెతుకుతున్నా… నాపై ఆరోపణలు చేసిన వారు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతోంది.. ఈ నాలుగేళ్లుగా ఏం చేశారు? సిబిసిఐడి మీ వద్దే ఉంది కదా...ఎన్నికల తర్వాత దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఏంటని విజయసాయిని అడగండి అని అన్నాడు.
టిడిపి మంగళగిరిలో రెండు సార్లు గెలిచింది. టిడిపికి కంచుకోటగా మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని సవాల్గా తీసుకున్నాను. మొదటిసారి ఓడిపోయాను. అయితే, ఇది నాలో సంకల్పాన్ని, పట్టుదలను పెంచింది. 2024లో రాబోయే ఎన్నికల్లో టిడిపి మంగళగిరిలో గెలుస్తుంది. చరిత్ర తిరగరాస్తుంది అన్నారు.
పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. రోజంతా నడవడం వల్ల అలసిపోయిన కాళ్ళను.. పాదయాత్ర ముగిసిన తర్వాత చల్లని నీళ్లలో పెట్టి ఉపశమనం పొందుతానని చెప్పారు. ప్రతి రోజు రాత్రి పాదయాత్ర ముగిసిన తర్వాత సీనియర్లతో ఆరోజు జరిగిన విషయాలపై చర్చిస్తామని.. సరదాగా మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్, పవన్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తారా అని ఒకరు ప్రశ్నించక దానికి సమాధానం… ‘రాష్ట్రంలో మార్పు రావాలి.. అగ్రస్థానానికి వెళ్లాలని ఆశించిన వారు 100% రాజకీయాల్లోకి రావాలి. 2014లో ఒకసారి పవన్ ను కలిశాను. అప్పుడు ఆయన మంచి మనసు నాకు తెలిసింది’ అని చెప్పుకొచ్చారు
అయితే, ‘హలో లోకేష్’ కార్యక్రమంలో విద్యార్థులతో ముఖాముఖి సమావేశమైన వేదిక సమీపంలో ఓ డ్రోన్ కలకలం రేపింది. వేదిక దగ్గరలో డ్రోన్ తిరుగుతుండడం పార్టీ నాయకులు గుర్తించారు. దాన్ని నిర్వహిస్తున్న వారిని పట్టుకుని ప్రశ్నించగా పోలీసుల సూచనల మేరకే తాము డ్రోన్ వీడియో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత టిడిపి నాయకుల అసంతృప్తి మేరకు డ్రోన్ నిర్వహకులను పోలీసులు పంపించేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది.