అందరూ కూర్చున్నారు, లోటస్ పాండ్ కు ఫోన్: వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు

Published : Feb 24, 2023, 09:19 PM IST
అందరూ కూర్చున్నారు, లోటస్ పాండ్ కు ఫోన్: వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు

సారాంశం

వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాది అంత:పురం కుట్రేనని చంద్రబాబు అన్నారు. అవినాష్ రెడ్డి అమాయకుడనే మాట నిజం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై తెలుగుదేశం పార్టీ (టిడిపి) చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్యతో పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డికి సంబంధం లేదని ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి అంటున్నారని, వివేకా హత్యకు ముందు అవినాష్ రెడ్డి ఇంటిలో అందరూ కూర్చున్నారని, వివేకా హత్య తర్వాత లోటస్ పాండ్ కు ఫోన్ వెళ్లిందని ఆయన అన్నారు.

వివేకానందరెడ్డిని భయానకంగా హత్య చేసి దాన్ని దాచిపెట్టేందుకు అనేక కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత ఏ జరిగిందనే విషయాలన్ని సిబిఐ దర్యాప్తులో బయటకు వచ్చాయని ఆయన చె్పారు. హత్యకు ముందు అవినాష్ రెడ్డి ఇంట్లో కుట్ర జరిగిందని సిబిఐ దర్యాప్తులో తేలినట్లు ఆయన చెప్పారు. ఏలూరులో జరిగిన టిడిపి జోన్ 2 సమీక్షా సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. 

రాజకీయాలకు అడ్డు వస్తున్నారని వివేకాను హత్య చేశారని ఆయన ఆరోపించారు. అంత జరిగినా కూడా అవినాష్ రెడ్డి అమాయకుడని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కితాబు ఇస్తున్నారని ఆయన అన్నారు. వివేకా ఎలా మరణించారనే విషయం తేలడానికి శవపరీక్ష చేయాల్సిందేనని వివేకా కూతురు సునీత పట్టుబట్టారని ఆయన గుర్తు చేశారు. తండ్రి హత్య కేసు విచారణపై సునీత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారని, కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకున్నారని చంద్రబాబు అన్నారు. 

వివేకా హత్యను తన పార్టీ నాయకుల మీదికి నెట్టేందుకు వైసిపి ప్రయత్నించిందని ఆయన అన్నారు. వివేకాదికి నూటికి నూరు పాళ్లు అంత:పురం కుట్రేనని చంద్రబాబు అన్నారు.

ఇదిలావుంటే, వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం సిబిఐ విచారణకు హాజరయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని విచారించారు. సిబిఐ విచారణ సరైన పద్ధతిలో జరగాలని తాను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. వివేకా హత్య జరిగిన రోజు ఘటనా స్థలానికి తాను వెళ్లే సరికి ఓ లేఖ ఉందని, దాన్ని దాచారని సిబిఐని అడిగినట్లు ఆయన తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్