
ఆమెకు కొన్నేళ్ల క్రితం పెళ్లయ్యింది. భర్త లారీ డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు. సంతోషంగా సాగిపోతున్న జీవితం. కానీ కొన్నేళ్ల కిందట ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే అతడు కొంత కాలం నుంచి ఆ మహిళను వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. ఇది తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏపీలోని కృత్తివెన్ను మండలంలో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కృత్తివెన్ను మండలం పాచ్చాపురం గ్రామానికి చెందిన ముత్యాల జ్యోతి (33) నివసిస్తోంది. అదే గ్రామానికి చెందిన గుంటూరు సందీప్ అనే యువకుడితో ఆమెకు పరిచియం ఏర్పడింది. దీంతో కొంత కాలం తరువాత ఇరువురి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇలా నాలుగు సంవత్సరాలుగా ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.
జ్యోతి తో వివాహేతర సంబంధం పెట్టుకున్న సందీప్ కు కొంత కాలంగా ఆమెను అనుమానంతో వేధించడం ప్రారంభించాడు. ఇలా తరచుగా జరుగుతూ వస్తోంది. అయితే ప్రియుడి వేధింపులు అధికం కావడంతో ఆమె భరించలేకపోయింది. దీంతో శనివారం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ ఆత్మహత్య పై సమాచారం అందుకున్న రూరల్ సీఐ వీరయ్య గౌడ్, కృత్తివెన్ను ఎస్ఐ గణేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.