చంద్రబాబు బడాయి, ఎందుకు అలా చేయలేదు: బొత్స

First Published May 23, 2018, 7:20 AM IST
Highlights

తన పిలుపు మేరకు కర్ణాటకలో తెలుగు ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుకోవడాన్ని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ తప్పు పట్టారు.

విజయవాడ: తన పిలుపు మేరకు కర్ణాటకలో తెలుగు ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుకోవడాన్ని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ తప్పు పట్టారు. 

ఎన్నికలకు ముందు బీజేపీకి ఓటు వేయవద్దని ధైర్యంగా తెలుగు ప్రజలకు ఎందుకు బహిరంగ విజ్ఞప్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు చంద్రబాబు ప్రచారం చేయలేదని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో అడిగారు. 

ఓట్లు కొనేందుకు గాలి జనార్థన్ రెడ్డి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రయత్నించారని, దీన్ని వైఎస్సార్‌ సీపీ ఎందుకు ప్రశ్నించడం లేదని కూడా అన్నారని గుర్తు చేస్తూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నారని, దాన్ని ఖండించినట్లే, కర్ణాటకలో ప్రలోభాలు జరిగితే దాన్ని కూడా తమ పార్టీ ఖండిస్తోందని ఆయన అన్నారు. 

ఈ విషయాన్ని యనమల గుర్తించాలని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ప్రతిపక్షంపై టీడీపీ బురదచల్లుతోందని అన్నారు. కర్ణాటకలో డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే చేసిన ప్రయత్నంపై విచారణ జరగాలని, అలాగే చంద్రబాబు ఓటుకు నోటు కేసుపై కూడా విచారణ జరగాలని ఆయన అన్నారు.

విశాఖలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఎందుకో అర్ధం కావడం లేదని, నాలుగేళ్ల బీజేపీతో కలిసి ప్రత్యేక హోదాను వదిలిపెట్టిన చంద్రబాబు ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరమని బొత్స అన్నారు. ప్రత్యేక ప్యాకేజీని ఆనాడు కోరుకున్నారని,  ఇప్పుడు ప్రత్యేక హోదా అనడం విచిత్రమని ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 

విశాఖపట్నంలో శాంతియుత ర్యాలీ కోసం వచ్చిన తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆంధ్రా యూనివర్సిటీలో యువభేరి సభ పెడతామంటే ప్రభుత్వం అనుమతి కూడా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అదే ప్రదేశంలో చంద్రబాబు దీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీతో తమ పార్టీకి సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, మరోవైపు బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ సభ్యురాలిగా పదవి ఇచ్చారని బొత్స అన్నారు.

click me!