కరోనా వ్యాప్తిలో ఏపీ ప్రథమస్థానం... రికవరీలో చివరి స్థానం: బోండా ఉమ

Arun Kumar P   | Asianet News
Published : Jul 22, 2020, 06:54 PM IST
కరోనా వ్యాప్తిలో ఏపీ ప్రథమస్థానం... రికవరీలో చివరి స్థానం: బోండా ఉమ

సారాంశం

కరోనా విషయంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అశ్రద్ధ రాష్ట్ర ప్రజలను కాటికి పంపుతోందని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు  ఆరోపించారు. 

విజయవాడ: కరోనా విషయంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అశ్రద్ధ రాష్ట్ర ప్రజలను కాటికి పంపుతోందని... రోజురోజుకీ పెరుగుతున్న వైరస్ ఉధృతి కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా సర్కారులో చలనం లేకపోవడం సిగ్గుచేటని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. 

బుధవారం ఆయన విజయవాడలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాల నియంత్రణలో ఘోరంగా విఫలమైన ఏపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. కరోనా నియంత్రణలో, మరణాల కట్టడి, కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని... దేశంలోని 29 రాష్ట్రాలు కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటుంటే, జగన్ ప్రభుత్వం తన అసమర్థ విధానాలతో ప్రజలను కాటికి పంపుతున్నాడన్నారు.  జగన్ నాయకత్వంలో కరోనా వ్యాప్తిలో రాష్ట్రం ప్రథమస్థానంలో ఉంటే, రికవరీల్లో రాష్ట్రం దేశంలోనే చివరి స్థానానికి చేరిందన్నారు. 

''పారాసిట్మాల్, బ్లీచింగ్ తో కరోనా పోతుంది, సాంబ్రాణి కడ్డీ వేస్తే పోతుంది, అదేమీ పెద్ద జబ్బేమీ కాదు, జ్వరం లాంటిదే నన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు తోడు అధికారుల ఉదాసీనత, పనితీరువల్లే రాష్ట్రంలో నేడు ఈ దుస్థితి దాపురించింది. కరోనా వస్తే ఎక్కడికి వెళ్లాలో కూడా ప్రజలకు తెలియడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు మందుబిళ్ల ఇచ్చేవారు కూడా లేరు. పీపీఈ కిట్లు లేకపోవడం వల్ల వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుధ్య సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల ఆరోగ్యంపై, కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న ప్రకటనల్లోని డొల్లతనం క్షేత్రస్థాయిలో బయటపడుతోంది'' అని అన్నారు. 

''కరోనా బాధితులు, మరణించిన వారి వివరాలను  ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేకపోతోంది. బాధితుల సంఖ్యను ప్రభుత్వం దాచేకొద్దీ, ఆంధ్రప్రదేశ్ కేసుల సంఖ్యలో ముందుకు దూసుకుపోతోంది. అనుమానితుల నుంచి పరీక్షల కోసం తీసుకునే శాంపిల్స్ ను పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వదిలేయడం వల్లే, బాధితులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రజల ప్రాణాలు పిట్టలా రాలిపోతున్న తరుణంలో ప్రభుత్వం చేతులెత్తేయడం దుర్మార్గం. సొంత సొమ్ముతో వైద్యం చేయించుకోవాలన్నా, ప్రైవేటు ఆసుపత్రుల వారు వైరస్ బాధితులను చేర్చుకోవడం లేదు. కరోనా ను ఆరోగ్యశ్రీ కింద చేర్చాము, ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మాటలకే పరిమితమయ్యాయి తప్ప, ఆచరణలోకి రావడం లేదు'' అని పేర్కొన్నారు. 

''మార్చి నుంచి ఇప్పటి వరకు కరోనాతో చనిపోయినవారి వివరాలను ప్రభుత్వం వైరస్ మరణాల్లో చూపడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 700మంది చనిపోయారని చెబుతున్న ప్రభుత్వం, విజయవాడలో మార్చి నుంచి జూలై వరకు ఎంతమంది చనిపోయారో చెప్పాలి. విజయవాడ నగరంలో వందలమంది కరోనాతో మరణించారు. కరోనా మరణాలపై ప్రభుత్వం వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి'' అని కోరారు. 

read more   ఏపీలో కరోనా: ఒక్క రోజులో విశాఖలో వేయికి పైగా కేసులు, గుంటూరులో 15 మంది మృతి

''కరోనాను కూడా అవినీతి వనరుగా మార్చుకున్న ప్రభుత్వం టెస్టింగ్ కిట్ల కొనుగోలు, బ్లీచింగ్ పౌడర్, మైదాపిండి పేరుతో వేలకోట్లు కాజేసింది. కేంద్రం, దాతలు ఇచ్చిన సొమ్మును వైరస్ బాధితులకోసం వినియోగించకుండా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి ఎవరో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సిబ్బంది కూడా చెప్పలేకపోతున్నారు. జగన్ ప్రభుత్వం దృష్టంతా మైనింగ్ మాఫియా, భూమాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియాలపైనే ఉంది. దోచుకున్న సొమ్మును రాష్ట్రాలు, దేశాలు దాటించడం ఎలా, ఎక్కడ దాచుకోవాలన్నదానిపైనే మంత్రులు ప్రభుత్వ పెద్దల ఆలోచనలున్నాయి'' అని ఆరోపించారు. 

''వైరస్ బారినపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందేవారికి రూ.2వేలు, మరణించిన వారికి రూ.15వేలు ఇస్తున్నట్లు చెప్పిన ప్రభుత్వం ఎక్కడ ఎన్ని కుటుంబాలకు ఇచ్చిందో చెప్పాలి. ఏ జిల్లాలో కూడా  రెండు రూపాయాలు కూడా కరోనా బాధితులకు అందలేదు. లక్ష పడకలు ఏర్పాటుచేస్తామని చెప్పి 4నెలలైనా నేటికీ ఎక్కడా అవి అందుబాటులో లేవు.  ప్రైవేటు ఆసుపత్రులతో మాట్లాడి, కరోనా బాధితులకు చికిత్స అందించేలా ప్రభుత్వం ఎందుకు మాట్లాడటంలేదు. క్వారంటైన్ కేంద్రాల్లోని వారికి సరైన ఆహారం, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు కూడా జగన్ ప్రభుత్వం సమకూర్చలేకపోవడం సిగ్గుచేటు'' అని మండిపడ్డారు. 

''ఢిల్లీలో కరోనా ఉధృతి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రధాని మోదీ అభినందించారు. కరోనా నియంత్రణలో, బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వ తీరుకి నిరసనగా 27వతేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతాము. కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఐసోలేషన్ కేంద్రాల్లో, క్వారంటైన్ కేంద్రాల్లోని బాధితులకు రూ.2వేలు ఇవ్వాలి'' అని డిమాండ్ చేశారు. 

''ల్యాబ్ ల సంఖ్యను పెంచి, ప్రతి జిల్లాలో సాధ్యమైనన్ని పడకలను తక్షణమే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలి. రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 10 వేలున్న కేసులు, నెల వ్యవధిలోనే 62వేలకు చేరాయి. వైసీపీ ప్రభుత్వ పెద్దలకు, మంత్రులకే ప్రభుత్వం పై నమ్మకం లేక పక్కరాష్ట్రాల్లో కరోనా చికిత్స పొందుతున్నారు'' అని అన్నారు. 

''4నెలల నుంచి బాధపడుతున్న కార్మికులు, పేదల కుటుంబాలకు రూ.10వేలు చెల్లించాలి. పెంచిన విద్యుత్, చమురు ఛార్జీలను జగన్ సర్కారు తక్షణమే తగ్గించాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాము. ప్రతిపక్ష డిమాండ్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించకుంటే, ఆయన ప్రభుత్వానికి చిక్కులు తప్పవు'' అని ఉమ హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Flags Off Vehicles to Lok Bhavan | Crore Signatures Paper Transfer | Asianet News Telugu
BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu