వాసిరెడ్డి పద్మ కొట్టే ప్రయత్నం చేశారు.. అత్యాచార ఘటనపై న్యాయం కోరితే నోటీసులు ఇస్తారా?: బొండా ఉమా

Published : Apr 23, 2022, 10:57 AM IST
వాసిరెడ్డి పద్మ కొట్టే ప్రయత్నం చేశారు.. అత్యాచార ఘటనపై న్యాయం కోరితే నోటీసులు ఇస్తారా?: బొండా ఉమా

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడకు, తనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడంపై బొండా ఉమా స్పందించారు. అత్యాచార ఘటనపై న్యాయం కోరితే మాకు నోటీసులు పంపుతారా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ హక్కులను వాసిరెడ్డి పద్మ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. 

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు వెళ్లిన తనను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ శ్రేణులు అడ్డుకుని గొడవకు దిగారని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ  ఆరోపించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడకు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు మహిళ కమిషన్ నోటీసులు జారీచేసింది. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని  కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

అయితే చంద్రబాబుకు, తనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడంపై బొండా ఉమా స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక వివకాలంగురాలికి 30 గంటలకు నరకం చూపించారని అన్నారు. చంద్రబాబు  నాయుడు బాధితురాలిని పరామర్శించేందుకు వస్తున్నారని తెలిసే ప్రభుత్వం నిద్ర లేచిందన్నారు. తాము వస్తున్నప్పుడే వాసిరెడ్డి పద్మ వచ్చారని తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరితే బెదిరిస్తారా అని ప్రశ్నించారు. న్యాయం అడిగిన వారిని వాసిరెడ్డి పద్మ చేయి ఎత్తి కొట్టబోయారని ఆరోపించారు. 

మహిళలపై అత్యాచారం జరిగితే ఈ ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారం జరిగితే ఆస్పత్రి సిబ్బందికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఆస్పత్రి గదిలో నిర్బంధించి మహిళాపై అత్యాచారం జరిగితే ఏమనుకోవాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. అత్యాచార ఘటనపై న్యాయం కోరితే మాకు నోటీసులు పంపుతారా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ హక్కులను వాసిరెడ్డి పద్మ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. 

మహిళల శీలాలకు వైసీపీ ప్రభుత్వం వెలకడుతోందని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మహిళా వాలంటీర్లను వేధిస్తున్న వైసీపీ వాలంటీర్లకు సన్లు లేవు కానీ.. తమకు సమన్లు ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ఆదేశాలతో వాసిరెడ్డి పద్మ తమకు సమన్లు జారీచేసిందని ఆరోపించారు. వైసీపీ బెదిరింపులకు ఎవరూ బెదరరని అన్నారు. వాసిరెడ్డి పద్మపై తాము ఫిర్యాదు చేస్తామని.. హైకోర్టును ఆశ్రయిస్తామని, జాతీయ మహిళ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Chandrababu Speech: అందుకే P4 తెచ్చాం.. 10లక్షల కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నాం | Asianet News Telugu
Vizag Roads Deserted During Sankranthi Festival: నిర్మానుష్యంగా వైజాగ్ రోడ్లు | Asianet News Telugu