పిన్నెల్లి కాల్ డేటా తీస్తే కుట్ర గుట్టు తేలుతుంది: బొండా ఉమా

By telugu teamFirst Published Mar 17, 2020, 11:46 AM IST
Highlights

మాచర్ల దాడి ఘటనపై టీడీపీ నేత బొండా ఉమమహేశ్వర రావు స్పందిస్తూ పోలీసులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి కాల్ లిస్ట్ తీస్తే తమపై జరిగిన దాడికి సంబంధించిన కుట్ర బయటపడుతుందని ఆయన అన్నారు.

విజయవాడ: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మొబైల్ కాల్ డేటా తీస్తే తమపై జరిగిన కుట్ర బయటకు వస్తుందని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత బొండా ఉమామహేశ్వర రావు అన్నారు. మాచర్ల దాడిపై తమకు పోలీసులు నోటీసులు జారీ చేయడంపై ఆయన మంగళవారం మీడియా సమావేశంలో స్పందించారు. తమకు గుంటూరు పోలీసులపై నమ్మకం లేదని ఆయన చెప్పారు.

మాచర్ల ఘటనపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేస్తామని, వాస్తవాలు బయటకు రావాలని ఆయన అన్నారు. మాచర్లలో తమపై జరిగిన దాడి ఘటనపై సిబీఐ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం భయాందోళనలకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. దాడి చేసినవారిని వదిలేసి తమను రమ్మంటున్నారని ఆయన పోలీసులపై ఆరోపణ చేశారు. 

Also Read: హత్యకు కుట్ర: విచారణకు పోలీసుల నోటీసుపై బుద్దా, బొండా రిప్లై

తమకు గుంటూరు పోలీసులపై నమ్మకం లేదని ముందే చెప్పామని, ఆ విషయాన్ని తాము డీజీపీకి ఆ విషయం చెప్పామని ఆయన అన్నారు. తమ నేత చంద్రబాబు స్వయంగా డీజీపీని కలిసి ఆధారాలు అందజేశారని ఆయన అన్నారు. తమపై దాడికి ఉపయోగించిన కర్రలను, రాళ్లను ఇచ్చామని, దాడికి సంబంధించిన వీడియో దృశ్యాలను ఇచ్చామని ఆయన వివరించారు. 

అన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా తమ కాల్ లిస్ట్ వెరిఫై చేస్తామని అంటున్నారని, పిన్నెల్లి కాల్ లిస్ట్ తీస్తే దాడికి చేసిన కుట్ర బయటపడుతుందని ఆయన అన్నారు. ఏ నిమిషంలో మీతో మాట్లాడుతున్నానో ఆ నిమిషంలో తాను బతికి ఉన్నట్లని, మరు నిమిషం ఏమవుతుందో తెలియదని ఆయన అన్నారు. 

Also Read: మాచర్ల దాడి... ధ్వంసమైన కారుతో విజయవాడ సిపి ఆఫీసుకు బోండా ఉమ

ఎన్నికలను వాయిదా వేస్తే ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సామాజిక వర్గాలంటూ బురద పూస్తున్నారని, ఎన్నికల్లో చెలరేగిన హింసపై పోలీసులు అసలు చర్యలే తీసుకోలేదని ఆయన అన్నారు. తాడేపల్లి నుంచి ఆదేశాలు వస్తుంటే డీజీపీ ఆఫీసు నుంచి అవి అమలవుతున్నాయని ఆయన అన్నారు. వ్యవస్థలను, న్యాయాన్ని కాపాడేది హైకోర్టు మాత్రమేనని ఆయన అన్నారు.

click me!