చంద్రబాబు ఖాళీగా కూర్చోలేదు, బుగ్గనవి పిట్టకథలు: బొండా ఉమా

By telugu teamFirst Published May 2, 2020, 2:50 PM IST
Highlights

కరోనా వైరస్ కట్టడి విషయంలో, కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు విషయంలో మంత్రి బుగ్గన చెప్పిన విషయాలపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వర రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. బుగ్గున పిట్టకథలు చెబుతున్నారని ఆయన అన్నారు.

విజయవాడ: కరోనా కిట్లపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిట్టకథలు చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత బొండా ఉమామహేశ్వర రావు వ్యాఖ్యానించారు. కిట్ల కొనుగోలులో జరిగిన మరిన్న అక్రమాలు వెలుగు చూస్తాయని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. చత్తీస్ గడ్ రూ.300 చొప్పున కొంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.700 చొప్పున కొనుగోలు చేసిందని ఆయన చెప్పారు. 

కరోనా కిట్ల కొనుగోలులో వందల కోట్ల రూపాయల కమిషన్ కొట్టేశారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి బుగ్గన బంధువు డైరెక్టర్ గా ఉన్న కంపెనీ నుంచి కేవలం కొటేషన్ ద్వారా కిట్లను కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. కేంద్రం కరోనా వైరస్ కట్టడికి ఇచ్చిన 2400 కోట్ల రూపాయలు ఏమయ్యాయో, ఎవరి జేబుల్లోకి వెళ్లాయో తెలియదని ఆయన అన్నారు. 

ప్రభుత్వ వైఫల్యం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిలో దేశంలోని టాప్ టెన్ రాష్ట్రాల్లో మన రాష్ట్రం చోటు చేసుకుందని, అదే సమయంలో దక్షిణాదిలో ప్రథమ స్థానంలో ఉందని ఆయన అన్నారు. టెస్టులు, కేసుల ధ్రువీకరణ, మరణాల సంఖ్య వంటి విషయాల్లో ప్రభుత్వం పూర్తి అవాస్తవాలు చెబుతోందని ఆయన అన్నారు.  

పాలనపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వద్ద శిక్షణ తీసుకోవాలని ఆయన సూచించారు. చేతగాకపోతే చంద్రబాబుకు పాలన అప్పగించాలని, కరోనా వైరస్ ను కట్టడి చేసి చూపిస్తారని ఆయన అన్నారు. చంద్రబాబు ఖాళీగా కూర్చోలేదని, అప్రమత్తం చేస్తున్నారని ఆయన అన్నారు.

click me!