
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో బాంబ్ బెదిరింపు కలకలం రేపింది. భక్తులను టార్గెట్ గా చేసి తిరుమల కొండపైకి వెళ్లేదారిలో బాంబ్ పెట్టినట్లు భద్రతా అధికారులకు ఇటీవల ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది తనిఖీలు చేపట్టగా ఎక్కడా బాంబ్ లేకపోవడంతో ఫేక్ కాల్ గా తేల్చారు. దీంతో టిటిడి అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
తిరుమల డిఎస్పీ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజు(ఆగస్ట్ 15) న తిరుమల కొండపైకి వెళ్లేదారిలో బాంబ్ పెట్టినట్లు ఫోన్ కాల్ వచ్చింది. కొండపైకి వెళ్లే దారిలోని అలిపిరి తనిఖీ కేంద్రంలోని ల్యాండ్ లైన్ కు ఉదయం ఈ బెదిరింపు కాల్ వచ్చింది. మధ్యాహ్నం మూడు గంటలకు బాంబ్ పేలుతుందని... దాదాపు 100మంది చనిపోతారంటూ సదరు దుండుగుడు బెదిరించాడు.
బాంబ్ బెదిరింపు కాల్ తో టిటిడి భద్రతా సిబ్బంది, నిఘా వర్గాలు అప్రమత్తమయ్యారు. స్థానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సాయంతో ముమ్మరంగా తనిఖీ చేపట్టినా ఎక్కడా పేలుడు పదార్థాలు వున్నట్లు తేలలేదు. దీంతో భయపెట్టడానికే బాంబ్ బెదిరింపు కాల్ చేసినట్లు గుర్తించారు.
Read More విషాదం.. పొలంలో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న రైతుపై ఏనుగు దాడి.. కాలితో తొక్కడంతో మృతి
టిటిడి అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్ నెంబర్ ఆధారంగా బాంబ్ బెదిరింపు కాల్ తమిళనాడు నుండి వచ్చినట్లు గుర్తించారు. సేలం జిల్లా పల్లపట్టికి చెందిన బాలాజీ ఈ బెదిరింపు కాల్ చేసినట్లు నిర్దాంరించారు. శనివారం అతడిని అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ భాస్కర్ రెడ్డి వెల్లడించారు.