బొబ్బిలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 28, 2024, 5:42 PM IST
Highlights

చారిత్రకంగా, సాంస్కృతికంగా బొబ్బిలి తెలుగువారికి ఎంతో ప్రత్యేకం. పౌరుషానికి, సాహసానికి, త్యాగానికి బొబ్బిలి యుద్ధం ప్రతీక. తమిళనాడులోని తంజావూరు తర్వాత బొబ్బిలి వీణలకు అంతటి ప్రాధాన్యత వుంది. బొబ్బిలి నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఇక్కడి నుంచి 8 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు.  బొబ్బిలి రాజవంశీకులదే ఈ నియోజకవర్గంలో ఆధిపత్యం. తొలి నుంచి నేటి వరకు వారే ఎక్కువగా గెలుస్తూ వస్తున్నారు. బొబ్బిలి కోటపై మరోసారి వైసీపీ జెండా ఎగురవేయాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే  చిన అప్పలనాయుడుకు మరోసారి టికెట్ కేటాయించారు. ఈసారి బొబ్బిలి సంస్థాన వారసుడు బేబినాయనకు టీడీపీ టికెట్ కేటాయించింది. 

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని బొబ్బిలి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. చారిత్రకంగా, సాంస్కృతికంగా బొబ్బిలి తెలుగువారికి ఎంతో ప్రత్యేకం. బొబ్బిలి యుద్ధానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వుంది. పౌరుషానికి, సాహసానికి, త్యాగానికి బొబ్బిలి యుద్ధం ప్రతీక. కేవలం ఒకే ఒక్క రోజులో ఈ యుద్ధం ముగిసిందని చారిత్రకారులు చెబుతూ వుంటారు. వీణల తయారీకి ఈ ప్రాంతం పెట్టింది పేరు. తమిళనాడులోని తంజావూరు తర్వాత బొబ్బిలి వీణలకు అంతటి ప్రాధాన్యత వుంది. ఆధ్యాత్మికంగా రమణ మహర్షి ఆశ్రమం ఎంతోమందిని ఆకర్షిస్తోంది. పూర్వం బొబ్బిలి, కొఠియా, గుల్లసీతారంపురం, రాజాం, రేగిడి, కవిటి, సీతానగరం ప్రాంతాల్లోని దాదాపు 72 వేలకు పైగా ఎకరాల విస్తీర్ణంలో బొబ్బిలి సంస్థానం విస్తరించి వుంది. 

బొబ్బిలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. రాజకుటుంబానిదే ఆధిపత్యం :

1952లో ఏర్పడిన బొబ్బిలి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,02,364 మంది. వీరిలో పురుషులు 99,068 మంది.. మహిళలు 1,03,292 మంది. బొబ్బిలి సెగ్మెంట్ పరిధిలో బొబ్బిలి, రామభద్రపురం, బదంగి, థెర్లాం మండలాలున్నాయి. బొబ్బిలి నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఇక్కడి నుంచి 8 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు.

బొబ్బిలి రాజవంశీకులదే ఈ నియోజకవర్గంలో ఆధిపత్యం. తొలి నుంచి నేటి వరకు వారే ఎక్కువగా గెలుస్తూ వస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి సంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు 84,955 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి సుజయ కృష్ణ రంగారావుకు 76,603 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 8,352 ఓట్ల తేడాతో వరుసగా రెండోసారి బొబ్బిలిలో విజయం సాధించింది. 

బొబ్బిలి శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. 30 ఏళ్లుగా ఎగరని పసుపు జెండా :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. బొబ్బిలి కోటపై మరోసారి వైసీపీ జెండా ఎగురవేయాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే  చిన అప్పలనాయుడుకు మరోసారి టికెట్ కేటాయించారు. జగన్ సంక్షేమ పాలన, అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. ఆ పార్టీ ఇక్కడ గెలిచి దాదాపు 30 ఏళ్లు కావొస్తోంది.

ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా వున్న చిన అప్పలనాయుడు 1994లో టీడీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత చంద్రబాబు ఎన్నిరకాలుగా వ్యూహాలు మార్చినా బొబ్బిలిలో పసుపు జెండా ఎగరడం లేదు. ఈసారి బొబ్బిలి సంస్థాన వారసుడు బేబినాయనకు టీడీపీ టికెట్ కేటాయించింది. బొబ్బిలి రాజకుటుంబానికి ప్రజల్లో వున్న పేరు, ప్రభుత్వ వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి తనను గెలిపిస్తాయని బేబి నాయన ధీమాగా వున్నారు. 
 

click me!