బీజేపీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ చేస్తున్న మోసానికి చంద్రబాబు నాయుడు, జగన్ లు ఇద్దరు మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని బీజేపీ అంబానీ, అదానీలకు దోచి పెట్టిందని అన్నారు.
మన బీజేపీ పాలన మంచిది కాదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆ పార్టీ పాలనలో విలువలు దిగజారిపోతున్నాయని చెప్పారు. విజయవాడలోని బాలోత్సవ భవన్ లో ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పార్టీలు, సారూప్య,రాజకీయ, రైతు, కార్మిక, మహిళా, ప్రజా సంఘాల ఐక్య వేదిక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మి నారాయణ కూడా ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ఉన్మాదం సృష్టిస్తోందని ఆరోపించారు. మతాలను రెచ్చగొడుతోందని, కులాల మధ్య తగవులు పెడుతుందని విమర్శించారు. ఆ పార్టీవి స్వార్థ రాజకీయాలని, వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించారని అన్నారు. ఆ పార్టీని అధికారంలో నుంచి తొలగించే సమయం ఇప్పుడు వచ్చిందని అన్నారు.
మన పోరాటం రేపటి కోసమని వైఎస్ షర్మిల అన్నారు. అన్ని మతాలు మనుషులంతా ఒక్కటే అని చెబుతున్నాయని, కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం మతం పేరుతో చిచ్చు పెడుతోందని విమర్శించారు. బీజేపీని విమర్శిస్తే సీబీఐ, ఐటీ, ఈడీ లాంటి వ్యవస్థలను ప్రయోగిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ దాడులకు భయపడి ఎంతో మంది ఇష్టం లేకపోయినా ఆ పార్టీలోకి చేరిపోతున్నారని చెప్పారు. చివరికి ఎస్ బీఐని కూడా కలుషితం చేశారని అన్నారు.
దేశ అభివృద్ధి లో బీజేపీ పాత్ర లేనే లేదని, ఈ దేశాన్ని అంబానీ, అదానీలకు దోచి పెట్టిందని అన్నారు. బీజేపీ మెప్పు కోసం స్థానిక ప్రభుత్వాలు పని చేస్తున్నాయని తెలిపారు. ఏపీలో గంగవరం పోర్ట్ ను తక్కువ ధరకు అదానికి కట్టబెట్టారని ఆమె ఆరోపించారు. విశాఖ స్టీల్ ను సైతం అదానీ, అంబానీ లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని అన్నారు. బీజేపీ మెప్పు కోసం వైఎస్ జగన్ పని చేస్తున్నారని అన్నారు.
ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఊపిరి లాంటిదని వైఎస్ షర్మిల అన్నారు పదేళ్ల దానిని ఇస్తానని బీజేపీ చెప్పిదని, కానీ తరువాత విస్మరించిందని తెలిపారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో ఎక్కడో ఉండేదని అన్నారు. బీజేపీ చేస్తున్న మోసానికి చంద్రబాబు నాయుడు, జగన్ లు ఇద్దరు మౌనం వహించారని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండి కూడా నిజమైన ఉద్యమాలు చేయలేదని అన్నారు రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటుతున్నా.. ఇంకా రాజధాని లేకపోవడం తలదించుకునే విషయమని అన్నారు.