
Tangella Uday Srinivas Biography: ఉదయ్ శ్రీనివాస్ పూర్తి పేరు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఆయన సొంతూరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతం. పదో తరగతి వరకు కడియం లోనే చదువుకున్నారు. ఇంటర్ పుదుచ్చేరిలో పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాదులోని టీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో పట్టా అందుకున్నాడు. అనంతరం దుబాయ్ వెళ్లి పలు ఐటీ సంస్థల్లో లక్షల జీతాలు తీసుకుంటూ పనిచేశాడు. ఖరీదైన జాగ్వార్ కారు, లగ్జరీ విల్లా ఇలా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు.
ఈ సందర్భంలో 2015లో సడెన్ గా ఉద్యోగం మానేసి తన బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఇండియాకి తిరిగి వచ్చారు. కానీ, శ్రీనివాస్ నిర్ణయాన్ని అతని కుటుంబంలో ఎవరూ అంగీకరించలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడులా తన సొంత వ్యాపారం వైపు అడుగులేశారు. ఇక 2016లో ’టీ టైమ్’ పేరిట తన కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. తన మొదటి అవుట్ లైన్ ఐదు లక్షలతో ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో 150 చదరపు అడుగుల స్థలంలో ప్రారంభించారు.
ఎవరూ ఊహించని విధంగా ప్రారంభించిన ఏడాది కాలంలోనే తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా 100 అవుట్ లేట్లు ప్రారంభయ్యాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఉంది. ఒక్క హైదరాబాద్ లోనే 280 అవుట్ లేట్లు తెరబడ్డాయి. ఇప్పుడు భారతదేశం అంతటా సుమారు 3000 అవుట్ లెట్స్ ఉన్నాయి. మొదటి అవుట్లైట్ మినహా మిగిలినవన్నీ ఫ్రాంచైజీలే. కేవలం 45 మంది ఉద్యోగులు ఉన్నా ఈ సంస్థ టర్నోవర్ రూ.35 కోట్లకు చేరిందంటే అతిశయోక్తి కాదు.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టీ చైన్ వ్యాపారాల్లో ఒకటిగా టీ టైం అవుట్లెట్ చేరింది. ఈ బిజినెస్ ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మందిని పారిశ్రామికవేత్తలను తయారు చేశారు. ఇకపోతే శ్రీనివాస్ భార్య బాకుల్ ఆయుర్వేద వైద్యురాలు. వీరికి ఒక కుమార్తె అన్యా. భార్య ప్రోత్సాహంతో వ్యాపార రంగంలోకి దిగిన ఉదయ్ అనుకున్నది సాధించారు.
రాజకీయ ప్రవేశం
సక్సెస్ పుల్ బిజినెస్ మ్యాన్ కొనసాగుతున్న ఉదయ్ శ్రీనివాస్.. రాజకీయాలు, ప్రజాసేవపై దృష్టి సారించాడు. తన ఆలోచనలకు అనువుగా కనిపించిన పార్టీ జనసేన లో చేరారు. అనతికాలంలోనే పవన్ కళ్యాణ్ కు దగ్గరయ్యారు. పవన్ కూడా ఉదయ్ ఆలోచనలను ప్రోత్సహించే క్రమంలో కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇంతటి సక్సెస్ఫుల్ పర్సన్ చట్టసభల్లో అడుగుపెడితే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడం ఖాయమని పవన్ ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారని టాక్.