గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పండి: జగన్ పై పురంధేశ్వరి కామెంట్స్

By Nagaraju penumalaFirst Published Nov 4, 2019, 1:45 PM IST
Highlights

రాష్ట్రంలో వరదలు వచ్చి 2నెలలే అయ్యిందని కానీ మీరు వచ్చి 5నెలలు గడుస్తోంది కదా అని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పాత ఇసుక విధానాన్ని రద్దు చేసి నూతన పాలసీ విధానం తీసుకురావడానికి ఐదు నెలల సమయం కూడా సరిపోలేదా అని నిలదీశారు.   

విజయవాడ: రాష్ట్రంలో ఇసుక కొరత నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గుండెలమీద చెయ్యివేసుకుని సమాధానం చెప్పాలని సీఎం వైయస్ జగన్ ను నిలదీశారు మాజీ కేంద్రమంత్రి, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. 

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తుందని నేటికి ఇసుక సంక్షోభంపై ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా తినడానికి తిండి లేకపోవడంతో ఆత్మహత్మలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. 

రాష్ట్రంలో ఇసుక సంక్షోభాన్ని నిరసిస్తూ విజయవాడలో బీజేపీ ఇసుక సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. ఇసుక సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న పురంధేశ్వరి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక కొరత సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వరదలు వచ్చాయని చెప్పడం సాకు మాత్రమేనని అందులో వాస్తవం లేదన్నారు. ఇది కేవలం కృత్రిమ కొరతమాత్రమేనని ఆరోపించారు. ముందస్తుగా ఇసుకను ఎందుకు నిల్వ చేయలేకపోయారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. 

రాష్ట్రంలో వరదలు వచ్చి 2నెలలే అయ్యిందని కానీ మీరు వచ్చి 5నెలలు గడుస్తోంది కదా అని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పాత ఇసుక విధానాన్ని రద్దు చేసి నూతన పాలసీ విధానం తీసుకురావడానికి ఐదు నెలల సమయం కూడా సరిపోలేదా అని నిలదీశారు.   

పీపీఏల రద్దు, రివర్స్‌ టెండరింగ్‌, ఇసుక సమస్యల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్లిపోతుందని పురంధేశ్వరి విమర్శించారు. ఇకపోతే రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇసుక దోపిడీ జరిగిందని, మాఫియా చెలరేగిపోయిందంటూ కొంతకాలం, నూతన ఇసుక పాలసీ అంటూ మరికొంత కాలం ఇలా కాలయాపన చేశారే తప్ప ఇసుకను అందుబాటులోకి తీసుకురావడం లేదని మండిపడ్డారు. 

జూన్ నెల నుంచి భవన నిర్మాణ కార్మికులకు ప్రతీ నెల రూ.10వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఆత్మహత్యకు పాల్పడ్డ భవన నిర్మాణ కార్మికులు అందరికీ రూ.25 లక్షల నష్టపరిహారం అందివ్వాలని దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

సీఎం జగన్ పదేపదే అలా మాట్లాడటం సరికాదు: దగ్గుబాటి పురంధేశ్వరి

వైసీపీకి దగ్గుబాటి తనయుడు రాజీనామా: పురంధేశ్వరి కోసమే

click me!