గురువారం ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల బిల్లు మీద చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వికేంద్రీకరణ పేరుతో విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని సుజనా చౌదరి మండిపడ్డారు.
అమరావతి : రాజధాని amaravatiపై హైకోర్టు తీర్పును వక్రీకరిస్తూ, కోర్టు అధికారాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎంపీ sujana chowdary అన్నారు. మూడు రాజధానులు అంశ పై సీఎం YS Jagan అసెంబ్లీలో చేసిన ప్రకటనపై సుజనాచౌదరి స్పందించారు. అమరావతిని ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ అంగీకరించలేదా? అని ప్రశ్నించారు. రాజధాని పై అసెంబ్లీ లో ప్రభుత్వ పెద్దలు మాట్లాడారు. సంఖ్యాబలం ఉందని దబాయిస్తే వక్రీకరణలు వాస్తవం కావు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తాం అంటే కుదరదు.
పార్లమెంట్ ఆమోదించిన విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయం తీసుకోవడం, దీనికి ఆనాడు విపక్షంలో ఉన్న YCP మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్లీ రాజధాని మార్చాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదానికి పంపాలి. విభజన చట్టాన్ని ఉల్లంఘించి రాజధానిని మార్చడం న్యాయపరంగా చెల్లదు. సిఆర్డిఏకి భూములిచ్చిన రైతులకు మధ్య చట్టబద్ధమైన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, సీఆర్డీఏని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. ఈ రెండు అంశాలను హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అంతేగాని.. శాసనసభకు, ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారం లేదని కోర్టు చెప్పలేదు.
కోర్టులపై దుష్ప్రచారం చేస్తూ కోర్టుల విశ్వసనీయతను దెబ్బతీయడమే లక్ష్యంగా శాసనసభ వేదికగా చేసుకుని జగన్, ఆయన వందిమాగాధులు అసత్య ప్రచారం చేశారు. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించి, కోర్టు తీర్పులకు వక్ర భాష్యాలు చెప్పడం తీవ్ర ఆందోళనకరమైన అంశం. వ్యవస్థల విధ్వంసం కోసం ఎంతకైనా తెగిస్తారని సభ సాక్షిగా మరోసారి నిరూపించారు. వికేంద్రీకరణ పేరుతో విద్వేష రాజకీయాలకు తెర తీస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో జగన్ ప్రభుత్వం మళ్లీ మూడు రాజధానులు బిల్లు తెస్తే న్యాయసమీక్షకు నిలవదు. ఏపీకి కావాల్సింది అధికార వికేంద్రీకరణ కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ.. అని.. ఏపీ సమగ్రాభివృద్ధికి, ఏకైక రాజధాని అమరావతి అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంది’ అని సుజనాచౌదరి స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, గురువారం అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల మీద హైకోర్టు తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో వుండాలని.. లేకపోతే మొత్తం సిస్టమ్ కుప్పకూలుతుందని సీఎం వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాజధానిపై వాళ్లంతకు వాళ్లే ఊహించుకుని పెట్టారని జగన్ చెప్పారు. శాసన వ్యవస్థ ఓ చట్టాన్ని చేయాలా.. వద్దా అని కోర్టులు నిర్ణయించలేవని ఆయన అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారు కాబట్టే ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయాన్ని కట్టబెట్టారని జగన్ పేర్కొన్నారు. నెల రోజుల్లో లక్ష కోట్లతో రాజధాని కట్టేయాలని కోర్టులు ఎలా డిక్టేట్ చేస్తాయన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకు వుందని జగన్ చెప్పారు. వికేంద్రికరణతోనో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని సీఎం గుర్తు చేశారు. 3 రాజధానుల బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంలో చెప్పిన మాటలన్నింటికీ తమ సర్కార్ కట్టుబడి వుందని జగన్ స్పష్టం చేశారు.