మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అభిప్రాయపడ్డారు.ఈ క్రమంలోనే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు వచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు.
న్యూఢిల్లీ:మహిళల అభ్యున్నతి కోసం పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు వచ్చినట్టుగా బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు చెప్పారు.బుధవారంనాడు న్యూఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు మీడియాతో మాట్లాడారు.జనగణన, డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ అమలు కానుందన్నారు.2026 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారితే దేశంలోని చట్టసభల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరగనుందని ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.నీతి ఆయోగ్ గ్రోత్ హబ్స్ గా నాలుగు నగరాలు ఎంపికైన విషయాన్ని జీవీఎల్ నరసింహరావు చెప్పారు. దక్షిణాది నుండి విశాఖ నగరం ఎంపికైందన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుండి ముంబై, సూరత్, వారణాసి పట్టణాలు పైలెట్ ప్రాజెక్టు కింద కేంద్రం ఎంపిక చేసిందని జీవీఎల్ నరసింహారావు చెప్పారు.
లోక్ సభలో కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్ నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.ఈ బిల్లును ఆమోదించేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ నిన్న విపక్షాలను కోరారు. పార్లమెంట్ కొత్త భవనంలో పార్లమెంట్ ఉభయ సభలు నిన్న కొలువుదీరాయి. కొత్త పార్లమెంట్ భవనంలో మహిళా రిజర్వేషన్ ను తొలి బిల్లును ప్రవేశ పెట్టింది కేంద్రం. ఈ బిల్లులో కొన్ని సవరణలను విపక్షాలు సూచిస్తున్నాయి.
undefined
ఓబీసీ, ఎస్‌సీలకు రిజర్వేషన్లను ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే కోరారు. ఇదే తరహా డిమాండ్ ను మరికొన్ని పార్టీలు కూడ లేవనెత్తాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇవాళ లోక్ సభలో చర్చ జరగనుంది. ఆరు గంటల పాటు ఈ చర్చ సాగనుంది. రేపు రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యూఢిల్లీలో ఆందోళన నిర్వహించారు.ఈ ఆందోళన కార్యక్రమానికి పలు పార్టీల నేతలను కూడ ఆహ్వానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వాలని కోరారు. ఈ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే బీసీలకు రిజర్వేషన్లను కల్పించాలని కూడ ఆ పార్టీ కోరుతున్న విషయం తెలిసిందే.