జగన్ పాదయాత్ర... విశాఖలో వింత

First Published Apr 24, 2018, 3:27 PM IST
Highlights


బీజేపీ, వైసీపీ ల పొత్తుకు ఇదే సాక్ష్యం

జగన్ పాదయాత్ర విశాఖపట్నానికి చేరుకోగానే.. అక్కడ ఓ వింత జరగనుంది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే ఈ పొత్తుకు బీటలు పడ్డాయి. చంద్రబాబు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారు. దీంతో.. అప్పటి నుంచి బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం ఊపందుకుంది. కాగా.. ఈ ప్రచారాన్ని నిజం చేసే సంఘటన ఒకటి త్వరలో విశాఖపట్నం వేదికగా జరగనుంది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఏపీ బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా విశాఖ చేరుకున్నాక ఆయనను  వెళ్లి కలుస్తామని చెప్పారు. ఇప్పటివరకు జగన్ పాదయాత్రలో ఇలాంటి సంఘటన ఎదురు కాలేదు. ఆయన పాదయాత్ర చేస్తుండగా.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మద్దతుగా ఆయనతో పాటు నడుస్తూ వచ్చారు. అయితే.. తొలిసారిగా బీజేపీ నేతలు విష్ణు కుమార్ రాజు, హరిబాబులు ఆయనకు స్వాగతం చెప్పాలని భావిస్తున్నారు. దీంతో.. వచ్చే ఎన్నికలకు వీరి పొత్తు బలపడే అవకాశం ఉందనే వాదనలు వినపడుతున్నాయి.

ఇదిలా ఉండగా.. మొన్నటి వరకు పొత్తులో ఉన్న టీడీపీ నేతలపై విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. గత ఎన్నికల్లో టీడీపీ కారణంగానే తమ పార్టీ చాలా నష్టపోయిందన్నారు. మే 15వ తేదీ నుంచి చాలా మంది టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ చేయనున్నట్లు జోస్యం చేశారు. ధర్మపోరాట దీక్ష రోజు బాలయ్య మోదీపై చేసిన ఆరోపణలు గర్హనీయమన్నారు.

click me!