బీజేపీలో సీఎం అభ్యర్థులకు కొదవలేదు.. డిమాండ్లు, అల్టిమేట్‌లకు పార్టీ భయపడదు: నాగోతు రమేష్

Published : Jun 06, 2022, 12:33 PM IST
బీజేపీలో సీఎం అభ్యర్థులకు కొదవలేదు.. డిమాండ్లు, అల్టిమేట్‌లకు పార్టీ భయపడదు: నాగోతు రమేష్

సారాంశం

ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు బీజేపీకి నియమావళి ఉందని ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు తెలిపారు. బీజేపీలో సీఎం అభ్యర్థులకు కొదవలేదని అన్నారు. బీజేపీలో చాలా మంది సీఎం అభ్యర్థిగా నిలబడగల నేతలున్నారని చెప్పారు.

పొత్తులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతలు ఎవరికి తోచిన రీతిలో వారు స్పందిస్తున్నారు. అయితే పవన్ వ్యాఖ్యలపై స్పందించిన కొందరు బీజేపీ నేతలు తాము జనసేనతోనే పొత్తులోనే ఉన్నామని చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ చెప్పినట్టు బీజేపీ-జనసేన కూటమి ఎవరికోసమో త్యాగాలు చేసేందుకు సిద్ధంగా లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడాలని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.  మరికొందరు మాత్రం భిన్నంగా స్పందించారు. 

తాజాగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్.. బీజేపీ-జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్‌ను ప్రకటించాలని అన్నారు. దీంతో ప్రజల మద్దతు మరింతగా లభిస్తుందన్నారు. ఏపీ పర్యటనకు వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జగన్ అసమర్ద పాలనను ప్రస్తావించాలని, తద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. తమ పార్టీ తరఫున జేపీ నడ్డాకు స్వాగతం పలుకుతామని చెప్పారు. 

అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు బీజేపీకి నియమావళి ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు  అన్నారు. బీజేపీలో సీఎం అభ్యర్థులకు కొదవలేదని అన్నారు. బీజేపీలో చాలా మంది సీఎం అభ్యర్థిగా నిలబడగల నేతలున్నారని.. కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన సమర్ధులు ఉన్నారని చెప్పారు. బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు లేరని చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. డిమాండ్లు, అల్టిమేట్‌లకు బీజేపీ కార్యకర్తలు ఎవరు భయపడరని అన్నారు. నడ్డా పర్యటనలో సంస్థాగత విషయాలపై దిశా నిర్దేశం చేస్తారన్నారు. నడ్డా పర్యటనలో సీఎం అభ్యర్థిపై ఎలాంటి ప్రకటన ఉండదన్నారు. 

క్షేత్రస్థాయిలో కొంత గ్యాప్ ఉన్నమాట నిజమే.. పురంధేశ్వరి
పొత్తుల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేసారు. ఇదే విషయాన్ని నిన్న (శనివారం)  తమ మిత్రపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా చెప్పారని అన్నారు. అయితే పొత్తు అంశంపై ఎలా వెళ్లాలనేది మాత్రం జాతీయ నాయకులు నిర్ణయిస్తారని పురంధేశ్వరి పేర్కొన్నారు.  బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ ఉందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో జనసేన రాష్ట్ర నాయకులు మాట్లాడుతూనే ఉన్నారన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కొంత గ్యాప్ ఉన్నమాట నిజమేనన్నారు. కరోనా వల్ల సోషల్  డిస్టెన్స్ పెరిగిందంటూ పవన్ సరదా వ్యాఖ్యలను పురంధేశ్వరి గుర్తుచేసారు. సమన్వయంతో బీజేపీ, జనసేన పార్టీ లు ముందుకు వెళుతున్నాయని... పొత్తుల విషయంలో తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరం కలిసే ముందుకెళతామని పురంధేశ్వరి స్పష్టం చేసారు. ఆత్మకూరు ఉపఎన్నికల్లో అభ్యర్థిపై జనసేనతో చర్చించామన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థే బరిలో ఉంటారని... అతడికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని పురంధేశ్వరి ప్రకటించారు. 

ఇక వైసీపీ ప్రభుత్వం స్థాయికి, పరిమితికి మించి అప్పులు చేస్తోందని పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో ఉన్న అరాచక పరిస్థితి వల్ల పెట్టుబడి పెట్టే అవకాశం లేదన్నారు. ఎనిమిదేళ్లు అయినా ఏపికి రాజధాని లేదన్నారు. ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాని అన్నారు.  దేశ ప్రధాని నరేంద్ర మోదీని అనేక రాష్ట్రాల సిఎంలు కలుస్తారు... అలాగే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కలిసారు... ఇందులో తప్పేముందని అన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి భేటి అయినంత మాత్రాన బీజేపీ, వైసీపీ ఒక్కటేనని దుష్ఫ్రచారం తగదని పురంధేశ్వరి అన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!