
విజయనగరం జిల్లాలో వైసీపీకి మద్దతు పెరుగుతోంది. జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు సోమవారం వైసీపీలో చేరారు. బీజేపీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, మహిళా మోర్చా నాయకురాలు రమణిలు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.
పార్టీ కండువాలతో సాదరంగా వైఎస్ జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు 200 మంది బీజేపీ కార్యకర్తలు కూడా వైసీపీలో చేరారు. అనంతరం మధు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర దేశ రాజకీయాల్లో మరెవ్వరికి సాధ్యం కాని ఘనత అని తెలిపారు. వైఎస్ జగన్‌కు లభిసున్న ప్రజాదరణ అపూర్వం అని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా విజయనగరం జిల్లాలో టీడీపీ నేతలు చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు.