పవన్ కు ఏమైనా జరిగితే ఎపి భగ్గుమంటుంది: రామకృష్ణ

By pratap reddyFirst Published Oct 1, 2018, 11:31 AM IST
Highlights

తనకు భద్రత లేదని పవన్‌ స్పష్టంగా చెబుతుంటే ముఖ్యమంత్రి ఆ విషయాన్ని సీరియ్‌సగా తీసుకోవడం లేదని రామకృష్ణ ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. 

విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఏదైనా జరగరానిది జరిగితే రాష్ట్రం భగ్గుమంటుంటుందని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. తనకు భద్రత లేదని పవన్‌ స్పష్టంగా చెబుతుంటే ముఖ్యమంత్రి ఆ విషయాన్ని సీరియ్‌సగా తీసుకోవడం లేదని రామకృష్ణ ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. 

పవన్ కల్యాణ్ కు పటిష్టమైన భద్రత కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని అన్నారు. విశాఖ జిల్లాలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు కాల్చి చంపారని, అనంతపురంలో ఎంపీ, పోలీసులకు మధ్య వివాదాలు రోడ్డుకెక్కాయని ఆయన గుర్తు చేశారు. 

నాలుగేళ్లు నిరుద్యోగ భృతిని పక్కన పెట్టిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్నాయని దాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు కల్పించకుండా ఇప్పుడు సవాలక్ష షరతులు పెట్టి నెలకు రూ.1000 భృతి ఇస్తామంటున్నారని అన్నారు. 

చంద్రబాబు వైఖరి చూస్తుంటే రోజూ అన్న క్యాంటీన్లో తిని.. చెట్టు కింద పడుకోమన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పథకం కింద కూలిపనులకు పోయినా ఇంతకంటే ఎక్కువే వస్తుందని చెప్పారు. కరువు ప్రాంత సమస్యలపై ఉద్యమించేందుకు సీపీఐ, సీపీఎం అక్టోబరు 3వ తేదీన సమావేశమవుతున్నట్లు ఆయన తెలిపారు.

click me!