తెలుగురాష్ట్రాల జలవివాదం... జగన్, కేసీఆర్ మద్య రహస్య ఒప్పందమిదే: బిజెపి విష్ణువర్ధన్

By Arun Kumar PFirst Published Jul 11, 2021, 12:57 PM IST
Highlights

తెలుగురాష్ట్రాల మధ్య జలవివాదానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ లే కారణమని బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. 

అనంతపురం: తెలంగాణ, ఏపీ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి నష్టం జరిగేలా తెలంగాణ నిర్ణయాలు తీసుకుంటే సీఎం చేతకాని తనంతో చూస్తూ వున్నారన్నారు. సీఎం జగన్ రాయలసీమ హక్కులను ఫణంగా పెడుతున్నారని విష్ణువర్ధన్ ఆరోపించారు. 

''అంతర్రాష్ట్ర జలవివాదాలపై ముఖ్యమంత్రి తక్షణమే అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. తెలంగాణ అక్రమ ప్రాజెక్టు లను, విద్యుత్ ఉత్పత్తిని ఎందుకు ఆపడం లేదు. తెలంగాణలో పార్టీలన్ని కేసీఆర్ విధానాలను తప్పు పడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? వైసిపి ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నాం'' అని హెచ్చరించారు. 

read more  ఇరకాటంలో జగన్... రాయలసీమ ఎత్తిపోతలపై స్వరాష్ట్రంలోనూ వ్యతిరేకత

''రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు, హక్కుల ను సీఎం గాలికి వదిలేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ సీమలో ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి ఉద్యమం లోకి రండి..  ప్రజలు గెలిపిస్తారు'' అని సూచించారు. 

''తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై పెత్తనం చేస్తోంది. అక్కడి ఆస్తులను గాలికి వదిలేశారు. హైదరాబాద్ లో రాజధానిగా ఉమ్మడి హక్కులు ఉన్నాయి.  ఇద్దరు సీఎం ల మధ్య రహస్య ఒప్పందం ఉంది. ఇతర పార్టీలు నదీజలాల వివాదంపై తమ వైఖరిని స్పష్టం చేయాలి... నోరు విప్పాలి'' అని బిజెపి నేత విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు. అవసరమైతే  బీజేపీ ఆధ్వర్యంలో శ్రీశైలం ను ముట్టడిస్తామని హెచ్చరించారు. 

''తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయాలని చూస్తూ బ్రిటీష్ వారసులుగా పాలకులు వ్యవహరిస్తున్నారు ఈ విషయం ఇప్పటికే కోర్టులో ఉంది. తెలుగు అకాడమీని రద్దు చేసి ఖూనీ చేసే ప్రయత్నాలను ఖండిస్తున్నాం. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కూడా తెలుగులో చదువుకొని పైకి వచ్చినవారే. కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలుగును ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది'' అని విష్ణువర్దన్ నిలదీశారు. 


 

click me!